CHANDRAYAN-3: చందమామతో ఒక మాట చెప్పాలి..

చంద్రయాన్-3 ప్రయోగానికి తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ సిద్ధమైంది. ఈ మధ్యాహ్నం 2 గంటల 35 నిమిషాల 13 సెకన్లకు రెండో ప్రయోగ వేదిక నుంచి LVM-3P4 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. తరువాత సరిగ్గా 16 నిమిషాల అనంతరం ప్రొపల్షన్ మాడ్యూల్ రాకెట్ నుంచి విడిపోనుంది. చంద్రయాన్-3 సుమారు 3 లక్షల 84 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి చంద్రుని నుంచి వంద కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి చేరుకుంటుంది. జాబిల్లి దక్షిణ ధ్రువంలోని నిర్దేశిత ప్రదేశంలో ల్యాండ్ అవుతుందని ఇస్రో తెలిపింది. చంద్రయాన్-3ని అంతరిక్షంలోకి తీసుకెళ్లే ఎల్‌వీఎం3లోని ఎల్110 స్టేజ్‌లో ప్రొపెల్లెంట్ ఫిల్లింగ్ పూర్తయిందని ఇస్రో శుక్రవారం మిషన్ అప్‌డేట్‌లో తెలిపింది. C25 దశలో ప్రొపెల్లెంట్ నింపడం ప్రారంభమైంది. ప్రయోగానికి కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ స్వయంగా హాజరుకానున్నారు.
సరిగ్గా 40 రోజుల తరువాత ఆగస్టు 23 లేదా 24 తేదీల్లో జాబిల్లిపై చంద్రయాన్-3 అడుగుపెట్టనుంది. చంద్రుడి దక్షిణ ధ్రువంలోని నిర్దేశిత ప్రదేశంలో ల్యాండర్‌ను దించేందుకు ఇస్రో ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. అందులోంచి రోవర్ బయటకు వచ్చి పరిశోధనలు చేయనుంది. చంద్రయాన్-3లో ఆర్బిటర్‌ను పంపడం లేదు. చంద్రయాన్ 2లో ప్రయోగించిన ఆర్బిటర్ చంద్రుడి చుట్టూ కక్ష్యలో తిరుగుతోంది. దాన్నే ఇప్పుడు వినియోగించుకోనున్నట్లు ఇస్రో ఇదివరకే వెల్లడించింది.
ఇప్పటివరకూ అమెరికా, సోవియట్ యూనియన్, చైనా మాత్రమే జాబిల్లిపై ల్యాండర్లను ఎలాంటి ఇబ్బంది లేకుండా దించాయి. ఐతే ఇప్పటిదాకా చంద్రుడిపై ఎవరూ వెళ్లని దక్షిణ ధ్రువానికి వెళ్ళి అక్కడి ప్రత్యేక పరిస్థితుల గురించి శోధించాలని భారత్ భావిస్తోంది. ఇప్పటిదాకా చంద్రుడిపైకి వెళ్లిన వ్యోమనౌకల్లో అత్యధికం అక్కడి మధ్య రేఖా ప్రాంతంలోనే దిగాయి. భారత్ మాత్రం చంద్రయాన్-3 కోసం ఇంతవరకూ వెలుగు చూడని దక్షిణ ధ్రువానికి దగ్గర్లోని 70 డిగ్రీల అక్షాంశం వద్ద ప్రాంతాన్ని ఎంచుకుంది. అక్కడ ల్యాండింగ్ ద్వారా విశ్వం ఆవిర్భావం గురించిన కొత్త విషయాలను తెలుసుకునే అవకాశం ఉండటంతో పాటు.. మునుముందు చంద్రుడిపై మానవ ఆవాసాల ఏర్పాటుకు బాటలు పడతాయని అకుంటున్నారు.
2008 అక్టోబరు 22న ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-1... చందమామ ఉపరితలంపై నీటి జాడను తొలిసారిగా కనుగొంది. చంద్రయాన్-1కు కొనసాగింపుగా రూ.978 కోట్లతో చంద్రయాన్-2ను 2019 జులై 22న ప్రయోగించారు. 48 రోజుల ప్రయాణం తర్వాత ఆర్బిటర్ చందమామ కక్ష్యలోకి దిగ్విజయంగా చేరింది. కానీ దక్షిణ ధ్రువం దిశగా సాగుతున్న ప్రయాణంలో జాబిల్లి ఉపరితలానికి 2 కిలోమీటర్ల ఎత్తులో నియంత్రణ కోల్పోయి, చంద్రుడిని బలంగా ఢీ కొట్టింది. ల్యాండర్, రోవర్‌లు ధ్వంసమయ్యాయి. చంద్రయాన్-2కు సంబంధించిన ఆర్బిటర్ మాత్రం ఇంకా పనిచేస్తోంది. చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తూ విలువైన డేటాను అందిస్తోంది. చంద్రయాన్-2 లోపాల నుంచి పాఠాలు నేర్చుకొని ఇప్పుడు చంద్రయాన్-3ని ఇస్రో ప్రయోగిస్తోంది. చంద్రయాన్-2ను సక్సెస్ ఆధారిత మోడల్‌లో రూపొందించగా.. చంద్రయాన్-3లో మాత్రం ఫెయిల్యూర్ ఆధారిత డిజైన్‌ను అమలు చేశారు. ఏదైనా వ్యవస్థ విఫలమైనప్పుడు, దాన్ని ఎలా రక్షించాలనే విధానమే ఇది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com