India on Russian oil: రష్యా చమురు కొనుగోలుపై జైశంకర్ క్లారిటీ..

రష్యా నుంచి చమురు కొనుగోలుకు సంబంధించి కేంద్ర మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంధన కొనుగోళ్ల విషయంలో రాజకీయ ఒత్తిళ్లు పని చేయవని ఆయన స్పష్టం చేశారు. అమెరికాతో మధ్యంతర వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేసిందంటూ అమెరికా ప్రకటించింది. ఈ నేపథ్యంలో జైశంకర్ స్పందించారు. ఇంధన కొనుగోళ్ల అంశం జాతీయ ప్రయోజనాలపై ఆధారపడి ఉంటుందని అన్నారు.
జర్మనీలోని మ్యూనిచ్ భద్రతా సమావేశంలో పాల్గొన్న ఆయన ఓ ప్రశ్నకు బదులిస్తూ, చమురు కొనుగోళ్ల విషయంలో భారత్ చాలా స్వతంత్రంగా వ్యవహరిస్తుందని ఆయన తెలిపారు. భారత్ తన వ్యూహాత్మక ప్రయోజనాలకు కట్టుబడి ఉందని అన్నారు. ఇంధన సమస్యల విషయానికి ప్రస్తుతం మార్కెట్ సంక్లిష్టంగా ఉందని వెల్లడించారు.
చమురు కొనుగోళ్లకు సంబంధించి భారత్‌లోని కంపెనీలు యూరోప్‌తో సహా ప్రపంచంలోని ఇతర ప్రాంతాలను పరిశీలిస్తాయని అన్నారు. ఖర్చులు, నష్టాలు, లభ్యతను చూసి వారి ప్రయోజనాలకు తగినట్లు కొనుగోళ్లు జరుపుతారని వెల్లడించారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
