Air Defence System: కొత్త ఎయిర్ డిఫెన్స్ ఆయుధ వ్యవస్థను ప్రయోగించిన భారత్..

అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ ఆయుధ వ్యవస్థను భారత్ విజయవంతంగా పరీక్షించిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తెలిపారు. ఈ వ్యవస్థను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) అభివృద్ధి చేసిందని పేర్కొన్నారు. సమీకృత గగనతల రక్షణ వ్యవస్థ (IADWS)ను ఆగస్టు 23వ తేదీ అర్థరాత్రి ఒడిశా తీరంలో సక్సెస్ ఫుల్ గా పరీక్షించారు. బహుళ అంచెల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌గా IADWSను అభివృద్ధి చేశారు. ఇది భారత్‌లో అభివృద్ధి చేసిన క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్, అడ్వాన్స్‌డ్ వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్, హై పవర్ లేజర్ ఆధారిత డైరెక్ట్ ఎనర్జీ వెపన్స్ ఇందులో ఉన్నాయి.
కాగా, ఈ పరీక్షతో బహుళ అంచెల గగనతల రక్షణ సామర్థ్యాన్ని భారత్ మరోసారి నిరూపించుకుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. శత్రువులు ప్రయోగించే గగనతల ఆయుధాల నుంచి ఆయా ప్రాంతాలను రక్షించడానికి ఇది మరింత ఉపయోగపడుతుందన్నారు. అయితే, ఆగస్టు 15వ తేదీన ప్రధాని మోదీ ప్రకటించిన ‘సుదర్శన చక్ర’ రక్షణ వ్యవస్థ అభివృద్ధి ప్రణాళిక తర్వాత కొన్ని రోజుల్లోనే IADWS పరీక్ష విజయవంతంగా పూర్తి కావడం విశేషం.
అయితే, ఇటీవలే భారత్ మధ్య శ్రేణి బాలిస్టిక్ క్షిపణి ‘అగ్ని-5’ను సక్సెస్ ఫుల్ గా ప్రయోగించింది. ఈ ప్రయోగంతో ఆ క్షిపణి యొక్క అన్ని సాంకేతిక, కార్యనిర్వాహక ప్రమాణాలను అందుకొని టార్గెట్ ను ఛేదించింది. డీఆర్‌డీవో అభివృద్ధి చేస్తున్న ఈ క్షిపణి పరిధి 5 వేల కిలోమీటర్లు ఉంటుంది. ఒకేసారి మూడు అణు వార్‌హెడ్‌లను మోసుకెళ్లి.. ఫైర్ చేసే సామర్థ్యం దీని సొంతం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com