Ballistic Missile: బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థ పరీక్ష విజయవంతం
స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన ‘బాలిస్టిక్ మిస్సైల్ రక్షణ వ్యవస్థ’ రెండో దశ ప్రయోగం సక్సెస్ అయ్యింది. 5 వేల కిలోమీటర్ల పరిధి కలిగిన శత్రు దేశ క్షిపణులను ఇది ఎదుర్కొనగలదు. ఒడిశాలోని చాందీపూర్‌లో ఈ ప్రయోగం చేపట్టారు. క్షిపణి రక్షణ వ్యవస్థ పూర్తి సామర్థ్యాలు ప్రదర్శించిందని రక్షణ శాఖ తెలిపింది. బాలిస్టిక్ క్షిపణిని పోలిన టార్గెట్ మిస్సైల్‌ను భూమి, సముద్రంపై ఏర్పాటు చేసిన రాడార్లు గుర్తించాయని, ‘ఇంటర్‌సెప్టార్’ వ్యవస్థతో దాన్ని కూల్చేశాయని పేర్కొన్నది.
భారత్ దేశం క్షిపణి దుర్భేద్యంగా మారుతోంది. తాజాగా ఈరోజు ఒడిశా తీరం నుంచి ఫేజ్-II బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్‌ను భారత్ బుధవారం విజయవంతంగా పరీక్షించినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పరీక్ష 5000 కి.మీ పరిధి కలిగిన బాలిస్టిక్ మిస్సైళ్ల నుంచి రక్షించడానికి ఉపయోగిపడుతుంది. పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో ఈ వ్యవస్థను అభివృద్ధి చేశారు.
టర్గెట్ మిస్సైల్‌ని LC-IV ధమ్రా నుండి సాయంత్రం 4.20 గంటలకు బాలిస్టిక్ మిస్సైల్‌లా ప్రయోగించారు. దీనిని భూమి, సముద్రం మీద మోహరించిన వెపన్ సిస్టమ్ రాడార్ కనుగొంది. ఆ తర్వాత AD ఇంటర్‌సెప్టర్‌ని యాక్టివేట్ చేసింది. ఫేజ్-2 ఏడీ ఎండో-అట్మాస్పియరిక్ మిస్సైల్ 4.22 గంటలకు చాందీపూర్ నుంచి ప్రయోగించారు. ఫ్లైట్ టెస్టులో లాంగ్ రేంజ్ సెన్సార్స్, లో లెటన్సీ కమ్యూనికేషన్ సిస్టమ్, ఎంసీసీ, అడ్వాన్సుడ్ ఇంటర్ సెప్టార్ తో కూడిన నెట్వర్క్ సెంట్రిక్ వార్‌ఫేర్ ఆయుధ వ్యవస్థ అనుకున్న విధంగా అన్ని లక్ష్యాలను చేరుకుంది.
ఆన్‌బోర్డ్ షిప్‌తో పాటు వివిధ ప్రదేశాల్లో మోహరించిన రేంజ్ ట్రాకింగ్ వ్యవస్థల ద్వారా విమాన డేటాను సేకరించి క్షిపణి పనితీరును అంచనా వేసినట్లు ప్రకటించారు. ఫేజ్-II AD ఎండో-అట్మాస్పియరిక్ క్షిపణి దేశీయంగా అభివృద్ధి చేయబడిన రెండు-దశల సాలిడ్-ప్రొపెల్డ్ గ్రౌండ్-లాంచ్డ్ క్షిపణి వ్యవస్థ. ఈ వ్యవస్థ శత్రు దేశాల నుంచి వచ్చే బాలిస్టిక్ మిస్సైళ్లను లో ఎక్సో- అట్మాస్పియర్ పరిధిలో తటస్థీకరిస్తుంది. డీఆర్డీఓ ల్యాబ్‌లో డెవలప్ చేసిన అనేక అత్యాధునిక స్వదేశీ సాంకేతికతను ఈ వ్యవస్థలో పొందుపరిచినట్లు ప్రభుత్వం తెలిపింది. దేశం యొక్క బాలిస్టిక్ క్షిపణి రక్షణ సామర్థ్యాన్ని ఈ పరీక్ష మళ్లీ నిరూపించిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com