Terrorist Attack: “సింధు జలాల ఒప్పందం” రద్దు, వాఘా మూసివేత..

పహల్గామ్ ఉగ్ర ఘటనకు భారత్ పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకోవడం ప్రారంభించింది. పాకిస్తాన్‌తో 1960లో చేసుకున్న ‘‘సింధు జలాల ఒప్పందం’’ రద్దు చేస్తున్నట్లు భారత్ ప్రకటించింది. అటారీ-వాఘా సరిహద్దును మూసేస్తున్నట్లు విదేశాంగ కార్యదర్శి ప్రకటించారు. ప్రధాని నరేంద్రమోడీ నివాసంలో జరిగిన సీసీఎస్( భద్రతపై కాబినెట్ కమిటీ) సమావేశంల తర్వాత ఈ నిర్ణయం వెలువడింది.
పాకిస్తాన్‌తో పూర్తిగా దౌత్య సంబంధాలను తెంచుకుంటున్నట్లు భారత్ ప్రకటించింది. పాకిస్తాన్ పౌరులు దేశంలో ఉంటే రెండు రోజుల్లో వెళ్లిపోవాలని భారత్ ఆదేశించింది. పౌక్ పౌరులకు గతంలో జారీ చేసిన వీసాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రాయబార కార్యాలయంలో సిబ్బందిని 55 నుంచి 30కి తగ్గించింది. పాక్ రాయబార కార్యాలయంలో సైనిక సలహాదారులు భారత్ విడిచి వెళ్లాలని ఆదేశించింది.
రెండు గంటలకు పైగా భేటీ
ప్రధాని మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఎస్) బుధవారం సాయంత్రం ఢిల్లీ లోని లోక్‌నాయక్ మార్గ్‌లో ఉన్న ప్రధాని నివాసంలో సమావేశమైంది.
రెండున్నర గంటలకు పైగా కొనసాగిన భేటీలో హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్‌తో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, సీనియర్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సీసీఎస్ భేటీలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా పాల్గొనాల్సి ఉంది. ఉగ్రదాడి ఘటన తెలిసిన వెంటనే తన అమెరికా పర్యటనను అర్థంతరంగా ముగించుకుని ఆమె దిల్లీకి బయలుదేరారు. మార్గమధ్యంలోనే ఉండడంతో భేటీకి హాజరుకాలేకపోయారు. హోంమంత్రి అమిత్ షా పహల్గాం ఘటనను ప్రధాని మోదీకి వివరించారు. తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. అంతకుముందు...సౌదీ అరేబియా పర్యటనను కుదించుకొని దిల్లీ చేరుకున్న ప్రధాని మోదీ విమానాశ్రయంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ ఆ భేటీలో పాల్గొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com