Chandrayaan-3 : మొదటి అడుగు

చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్ విజయవంతమైంది. భారత అంతరిక్ష పరిశోధనకు ఓ కొత్త దశ మొదలయ్యింది. విక్రమ్ ల్యాండర్‌ను దిగ్విజయంగా చంద్రుడిపై చేర్చిన ఇస్రో తదుపరి చర్యలకు పూనుకుంది. చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన విక్రమ్ ల్యాండర్ నుండి ప్రగ్నాన్ రోవర్ కొన్ని గంటల తరువాత విజయవంతంగా బయటికి వచ్చింది. ఆరు చక్రాల సాయంతో ల్యాండర్ నుండి చంద్రుడి ఉపరితలంపైకి రోవర్ దిగింది. ఇది 14 రోజులు చంద్రుడిపై తిరుగుతూ పరిశోధనలు చేయనుంది.

సౌరశక్తి సాయంతో జాబిల్లిపై వాతావరణ పరిస్థితులు, ఉపరితల నిర్మాణం వంటి అంశాలను రోవర్, ల్యాండర్ శోధిస్తాయి. ఇందుకోసం ఆధునిక పరికరాలను ఇస్రో (ISRO) జాబిలిపైకి పంపింది. ప్రజ్ఞాన్ సెకనుకు ఒక్కో సెం.మీ వేగంతో ల్యాండర్ ర్యాంపు ద్వారా వడివడిగా బయటకు వచ్చింది. చంద్రుడిపై భారత జాతీయ చిహ్నం, ఇస్రో లోగోను రోవర్ ముద్రించింది. రోవర్‌కు ఆరు చక్రాలను డిజైన్ చేశారు. ఇందులో కుడి వైపు చక్రాలు ఇస్రో లోగోను, ఎడమ వైపు చక్రాలు జాతీయ చిహ్నాన్ని చంద్రుని ఉపరితలంపై ముద్రించనున్నాయి. చంద్రుడిపై వాతావరణం లేకపోవడంతో ఈ చిహ్నలు చెరిగిపోకుండా ఉంటాయి. ఈ మేరకు గురువారం ఉదయం ఓ ట్వీట్ చేసింది. ‘చంద్రుడి కోసం చంద్రయాన్-3 రోవర్ భారత్‌లో తయారైంది. ఇప్పుడు అది ల్యాండర్ నుంచి బయటకు వచ్చింది. దీంతో భారత్ చంద్రుడిపై తన నడకను ప్రారంభించింది’ అని ఇస్రో తన ట్వీట్‌లో పేర్కొంది.

చంద్రుడిపై ఉన్న మట్టి, నీటిపై రసాయన పరిశోధన జరపనుంది. చంద్రుడిపై వాతావరణం ఎలా ఉంది అని పరిశోధించిన సమాచారాన్ని రోవర్ భూమికి చేరవేయనుంది.ఇక ల్యాండర్ విజయవంతంగా ల్యాండ్ అయిన తర్వాత ఇస్రో మరో కొత్త ఫోటోను విడుల చేసింది . ల్యాండింగ్ ఇమేజ్ కెమెరా ఈ ఫోటోను తీసిందని ఇస్రో తెలిపింది. చంద్రయాన్ 3 ల్యాండింగ్ సైట్ లోని కొంత భాగం ఇందులో కనిపిస్తోందని చెప్పింది. అలాగే ల్యాండర్ లెగ్ నీడను కూడా ఇందులో చూడొచ్చని ట్వీట్ చేసింది. చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్ 3 ప్లాట్ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుందని ఇస్రో వివరించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com