Chandrayaan-3 : చంద్రయాన్‌–3 లాంచ్ ఎప్పుడంటే..

Chandrayaan-3 : చంద్రయాన్‌–3 లాంచ్ ఎప్పుడంటే..
షార్ కేంద్రం నుంచి జులై 14 మధ్యాహ్నం ప్రయోగం ఆగస్టు 23, 24 తేదీల్లో చంద్రుడిపై ల్యాండింగ్

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ-ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న చంద్రయాన్ -3 ప్రయోగానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ నెల 14 మధ్యాహ్నం 2 గంటల 35 నిమిషాలకు చంద్రయాన్-3ని నింగిలోకి పంపనున్నారు. ఈ మేరకు భారీ వాహకనౌకకు పరికరాలను అమర్చే ప్రక్రియ శ్రీహరికోటలో వేగంగా జరుగుతోంది. ల్యాండర్ -రోవర్ మిళితంగా చంద్రయాన్ 3ని నింగిలోకి ప్రయోగించనున్నారు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్ -2 సాఫ్ట్ ల్యాండింగ్ లో విఫలమైన నేపథ్యంలో అలాంటి పొరపాట్లు తాజా ప్రయోగంలో పునరావృత్తం కాకుండా ఇస్రో జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ విడిపోయాక అది చంద్రుడి ఉపరితలం దిశగా ప్రయాణిస్తుంది. ఆ సమయంలో దాని వేగాన్ని పూర్తిగా నియంత్రించాల్సి ఉంటుంది. నిర్దేశిత వేగంతో సరైన ల్యాండింగ్ స్పాట్ లో సులువుగా చంద్రుడిపైకి ల్యాండర్ ను దింపాలి.



చంద్రుడి ఉపరితలం అత్యంత భిన్నంగా ఉంటుంది. పెద్ద పెద్ద కుహరాలు, వదులుగానూ, కఠినంగా ఉండే ఉపరితలం ఉంటుంది. ఫలితంగా చంద్రయాన్ -3లో రెండు ల్యాండర్ హజార్డ్ డిటెక్షన్ , అవాయిడెన్స్ కెమెరాలు పొందుపరుస్తున్నారు. అవి పంపే ఫొటోలను బట్టి ఎక్కడ ల్యాండ్ చేయాలో శాస్త్రవేత్తలు తుది నిర్ణయం తీసుకుంటారు.

బుధవారం ఎల్‌వీఎం-3పీ4 వాహక నౌకతో చంద్రయాన్‌-3 ఉపగ్రహాన్ని అనుసంధానించిన శాస్త్రవేత్తలు.. గురువారం వాహకనౌకను రెండో ప్రయోగ వేదికపైకి తీసుకొచ్చారు. ఇస్రో ప్రధాన లక్ష్యం చంద్రయాన్‌ను సురక్షితమైన , సాఫ్ట్ ల్యాండింగ్ చేయడమేనని ఇస్రో ఛైర్మన్ సోమ్‌నాథ్ అన్నారు. సాఫ్ట్ ల్యాండింగ్ జరిగితే అన్ని పరికరాలు బాగానే ఉంటాయని చెప్పారు. ల్యాండింగ్ తర్వాత రోవర్ బయటకు వస్తుందని దానికి 6 చక్రాలు ఉంటాయని పేర్కొన్నారు. ఆ రోవర్ చంద్రునిపై 14 రోజుల పాటు పని చేస్తుందని అందులోని బహుళ కెమెరాల సాయంతో ఇస్రో చిత్రాలను సేకరిస్తుందని వివరించారు . రోవర్‌లో సోలార్ ప్యానెల్ ఉందని దాన్ని ఇప్పటికే పరీక్షించగా బ్యాటరీ నుంచి మంచి ఫలితాలు వచ్చినట్లు తెలిపారు.




పరిస్థితులు అనుకూలిస్తే ఆగస్టు 23న చంద్రయాన్‌-3 రోవర్‌ జాబిలిపై పాదం మోపే అవకాశం ఉంది.ఇస్రో 2019లో ప్రయోగించిన చంద్రయాన్‌-2 ల్యాండర్ సాఫ్ట్‌లాండింగ్‌ జరగకపోవడంతో విఫలమైంది. ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై దిగుతూ క్రాష్ ల్యాండింగ్ జరిగి కూలిపోయింది. ఈ నేపథ్యంలో ఈసారి మళ్లీ ఆ తప్పిదం జరగకుండా ఉండేందుకు ఇస్రో ప్రయత్నిస్తోంది. ఇప్పటివరకు రష్యా, అమెరికా, చైనా మాత్రమే చంద్రుడిపై సాఫ్ట్‌ ల్యాండింగ్ చేయగలిగాయి. చంద్రయాన్-3ను సాఫ్ట్ ల్యాండింగ్ చేసి.. భారత్ కూడా వాటి సరసన చేరాలని భావిస్తోంది.

Tags

Next Story