INDIAN ARMY: సరిహద్దులకు యుద్ధ విమానాలు

INDIAN ARMY: సరిహద్దులకు యుద్ధ విమానాలు
చైనా, పాకిస్థాన్‌ సరిహద్దులకు తేజస్‌ యుద్ధ విమానాలు...వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌

సరిహద్దుల్లో చైనా, పాకిస్థాన్‌(border with Pakista, china)తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ భారత్‌ కీలక నిర్ణయం తీసుకుంది. దాయాది దేశం పాక్‌, విస్తరణ కాంక్షతో రగిలిపోతున్న చైనాకు చెక్‌ పెట్టేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఏ క్షణం.. ఎలాంటి ముప్పు వాటిల్లినా సమర్థంగా ఎదుర్కొనేందుకు ఇండియన్‌ వైమానిక దళం(Indian Air Force) సిద్ధమవుతోంది. కొండలు, లోయలతో నిండిన ప్రాంతాల్లో నిఘాను మరింత పటిష్టం చేసింది. అందుకోసం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌ల( Tejas fighter jets)ను సరిహద్దులకు భారత వైమానిక దళం(IAF) తరలించింది.


పాకిస్తాన్‌, చైనా(China and Pakistan)తో సరిహద్దులను పంచుకుంటున్న జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌ వంటి ప్రాంతాలు కొండలు, లోయలతో నిండి ఉంటాయి. మైదాన ప్రాంతాలతో పోల్చుకుంటే కశ్మీర్‌(Kashmir), లద్దాఖ్‌లలో యుద్ధ విమానాలు నడపడం సవాలుతో కూడుకున్నది. ఈ నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో పాకిస్తాన్‌ సరిహద్దు వెంబడి లోయలలో ప్రయాణించడంలో అనుభవం సంపాదించేందుకు, ఇతర ఆపరేషన్ల కోసం తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌(indigenous Light Combat Aircraft Tejas)లను ఫార్వర్డ్‌ బేస్‌లకు భారత వైమానిక దళం తరలించింది. కొండలు, లోయలతో కూడి ఉన్న ఈ కేంద్రపాలిత ప్రాంతాల్లో తేజస్‌ అభ్యాసాలను మెరుగుపరచడానికి ఈ నిర్ణయం తీసుకుంది. యుద్ధ విమానాల పైలట్లు అక్కడ విస్తృతంగా ఈ విమానాలను నడపనున్నారని రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు.


ఈ కేంద్ర పాలిత ప్రాంతం( Union Territory)లో భారత వైమానిక దళం స్థావరాలున్నాయి. చైనా, పాక్‌లను ఎదుర్కోవడానికి ఈ స్థావరాలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. జమ్మూకశ్మీర్‌లోనే కాకుండా చైనాతో సరిహద్దు కలిగి ఉన్న లద్ధాఖ్‌కు సైతం భారత వైమానిక దళం తేజస్‌ యుద్ధ విమానాలను తరలిస్తోంది.

విదేశీ విమానాలపై ఆధారపడకుండా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చెందిన తేజస్‌కు వైమానిక దళం ఎంతో ప్రాధాన్యతనిస్తోంది. దశలవారీగా ఈ విమానాలకు సరికొత్త సామర్థ్యాలను జోడిస్తోంది. ఈ ఏడాది జులై 1తో తేజస్‌ యుద్ధ విమానాలు భారత వైమానిక దళంలో ఏడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నాయి. గగనతల రక్షణ, సముద్ర నిఘా, వైమానిక దాడులు చేసే విధంగా తేజస్‌ యుద్ధ విమానాలను రూపొందించారు. ఇవి పాక్‌, చైనా కలిసి అభివృద్ధి చేసిన జేఎఫ్‌-17 యుద్ధ విమానాల కంటే మెరుగ్గా ఉన్నట్లు వెల్లడైంది. భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ డీఆర్‌డీవో అభివృద్ధి చేస్తున్న ఎల్‌సీఏ మార్క్‌ 2, ఏఎంసీఏలపై సైతం వైమానిక దళం దృష్టి సారించింది.

Tags

Read MoreRead Less
Next Story