C.R.RAO: గణిత మేధావి సీఆర్ రావు కన్నుమూత

ప్రపంచ ప్రఖ్యాత గణాంకశాస్త్ర నిపుణుడు, భారతీయ అమెరికన్ డాక్టర్ C.R. రావు (Mathematician CR Rao) కన్నుమూశారు. అమెరికాలో ఉన్న ఆయన అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం అమెరికాలో నివాసం ఉంటున్న 102ఏళ్ల C.R. రావు అనారోగ్యంతో బాధపడుతూ మరణించినట్లు(Mathematician CR Rao No More) కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతి పట్ల వివిధ రంగాల ప్రముఖులు సంతాపం తెలిపారు.
భారత్‌కు చెందిన ప్రఖ్యాత గణాంక నిపుణుడిగా గణిత శాస్త్రవేత్తగా డాక్టర్ సీఆర్ రావు(Indian American Mathematician CR Rao) ప్రపంచ ప్రఖ్యాతి పొందారు. స్టాటిస్టికల్ రంగానికే కాకుండా ఎకనమిక్స్, జెనెటిక్స్, ఆంత్రోపాలజీ రంగాలకూ విశేష సేవలందించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికా వరకు సాగిన ఆయన ప్రస్థానం ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచింది. వయసుతో సంబంధం లేకుండా ఎనిమిది పదుల వయసులోనూ ప్రొఫెసర్‌గా విద్యార్థులకు పాఠాలు బోధించి.. గణిత శాస్త్రంపై తనకున్న మక్కువను డాక్టర్ C.R. రావు చాటుకున్నారు. 75 ఏళ్ల కిందట గణాంక రంగంలో విప్లవాత్మకమైన ఆలోచనలకు బీజం వేసినందుకుగానూ ఆ రంగంలో నోబెల్ బహుమతికి సమానమైన. ఇంటర్నేషనల్ ప్రైజ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ 2023 అవార్డును ఆయన అందుకున్నారు.
దాదాపు 8 దశాబ్దాల పాటు గణిత శాస్త్రానికి విశేష సేవలందించిన.... డాక్టర్ కల్యంపూడి రాధాకృష్ణారావు 1920 సెప్టెంబరు 10న బళ్లారి జిల్లా హడగళిలో తెలుగు కుటుంబంలో జన్మించారు. తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని గూడూరు, నూజివీడు, నందిగామల్లో C.R. రావు బాల్యం గడిచింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎమ్మెస్సీ గణితం చేసిన ఆయన యూనివర్సిటీ ఆఫ్ కోల్‌కతాలో ఎంఏ స్టాటిస్టిక్స్ చేశారు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలోని కింగ్స్ కాలేజీలో 1948లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్‌లో విద్యార్థిగా చేరి అదే సంస్థకు డైరెక్టర్‌గా ఎదిగారు. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్‌గా పదవీ విరమణ చేసిన అనంతరం. సీఆర్ రావు అమెరికాలో స్థిరపడ్డారు. యూనివర్సిటీ ఆఫ్ బఫెలోలో రీసెర్చ్ ప్రొఫెసర్‌గా సేవలందించారు.
19 దేశాల నుంచి 39 డాక్టరేట్లు అందుకున్న డాక్టర్ C.R. రావు.... 477 పరిశోధన పత్రాలు సమర్పించారు. 15 పుస్తకాలు రాశారు. 2002లో అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ చేతుల మీదుగా ఆ దేశ అత్యున్నత నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ పురస్కారం అందుకున్నారు. యూకే ఇంటర్నేషనల్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమేటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ బయోమెట్రిక్ సొసైటీకి అధ్యక్షుడిగా పని చేశారు. భారత స్టాటిస్టిక్స్ రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా ప్రొఫెసర్ రావును భారత ప్రభుత్వం 1968లో పద్మభూషణ్, 2001లో పద్మవిభూషణ్‌తో సత్కరించింది. ఎన్‌ఎస్ భట్నాగర్ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. గణాంక రంగంలో నోబెల్ బహుమతికి సమానమైన ఇంటర్నేషనల్ ప్రైజ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ 2023 అవార్డును వరించింది. 102 ఏళ్ల వయసులో ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. 1945లో కోల్‌కతా మేథమేటికల్ సొసైటీలో ప్రచురితమైన సీఆర్ రావు పరిశోధన పత్రానికి ఈ అవార్డు దక్కింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com