Shubhamshu Shukla: శుభాంశు వెంట అంతరిక్షంలోకి కేరళ విత్తనాలు

Shubhamshu Shukla: శుభాంశు వెంట అంతరిక్షంలోకి కేరళ విత్తనాలు
X
వాతావరణ మార్పులతో పోరాడేలా విత్తనాలను తయారీలో కీలక పాత్ర

భారత అంతరిక్ష చరిత్రలో సువర్ణాధ్యాయానికి తెరలేచింది. భారతీయుల ఆకాంక్షలను మోసుకుంటూ రోదసిలోకి దూసుకెళ్లి కెప్టెన్‌‌ శుభాంశు శుక్లా మరో చరిత్ర లిఖించారు. గురువారం సాయంత్రం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లోకి విజయవంతంగా ప్రవేశించారు. ఆ ఘనత సాధించిన తొలి భారతీయునిగా చెరిగిపోని రికార్డును తన పేరిట లిఖించుకున్నారు.

భారత కాలమానం ప్రకారం సాయంత్రం నాలుగు గంటలకు అది భూమి నుంచి 418 కి.మీ.ల ఎత్తున ఐఎస్‌ఎస్‌తో విజయవంతంగా అనుసంధానమైంది. తర్వాత ఐఎస్‌ఎస్‌తో డ్రాగన్‌ అనుసంధాన (డాకింగ్‌) ప్రక్రియ కొనసాగాయి. శుభాంశు బృందం ఆనంద హేలను కెమెరాల్లో ఆ క్షణాలను బంధించి భద్రపరిచారు. ఇక, శుభాంశు బృందం 14 రోజులపాటు అక్కడ గడపనుంది. 60కి పైగా వినూత్న ప్రయోగాలు చేసి అత్యంత విలువైన సమాచారాన్ని అందించనుంది.

అయితే, ఈ అంతరిక్ష ప్రయాణానికి శుభాంశు తనతో పాటు కేరళకు చెందిన జ్యోతి, ఉమ, విజయ్, సూర్యను కూడా తీసుకెళ్లారట. మరి ఈ జ్యోతి, ఉమను శుభాంశు ఎలా తీసుకెళ్లాడనేది ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఏంటంటే.. శుక్లాతో కూడిన నలుగురు సభ్యుల బృందం ఆక్సియం-4 మిషన్​లో భాగంగా 14 రోజుల పాటు అంతరిక్షంలో వివిధ ప్రయోగాలు చేయనున్నారు. ఈ ప్రయోగాల్లో విత్తనాల అధ్యయనం అనేది అతిముఖ్యమైనది. ఈ అంతరిక్ష ప్రయోగంలో ఉపయోగించనున్న అన్ని విత్తనాలు కేరళ నుంచి పంపినవే కావడం గమనార్హం. వీటిని కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని వెల్లాయణి, పట్టాంబి వంటి ప్రాంతీయ కేంద్రాలు అభివృద్ధి చేశాయి.

విత్తనాలను అంతరిక్షంలోని సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో ఉంచి, తిరిగి భూమికి తీసుకొచ్చిన తర్వాత వాటిలో చోటుచేసే మార్పులను అధ్యయనం చేస్తారు. తద్వారా వాతావరణ మార్పులకు తట్టుకునే పంట రకాలను అభివృద్ధి చేయాలన్నది ఈ పరిశోధనల ప్రధాన లక్ష్యం. ఈ అధ్యయనం శాస్త్రీయంగా వాతావరణ మార్పులతో పోరాడేలా విత్తనాలను తయారు చేయడంలో కీలక పాత్రపోషిస్తుందని పరిశోధకుల నమ్మకం.

ఇంతకీ జ్యోతి, ఉమ ఎవరంటే?

జ్యోతి, ఉమ అనేవి కేరళలో చాలా పాపులర్ వరి విత్తనాలు. ఈ రెండు అధిక దిగుబడినిచ్చే వరి రకాలు. వరి సాగు కోసం రైతులు వీటిని విస్తృతంగా ఉపయోగిస్తారు. వరి విత్తనాలతో పాటు కింద చెప్పిన సీడ్స్‌ను కూడా శుభాన్షు తనతో తీసుకెళ్లారు. వీటిని పలుచోట్లలో అభివృద్ధి చేశారు.

వ్యోమనౌకలో బరువు పరిమితి కారణంగా ఇస్రో (ISRO), ఈఎస్​ఏ (ESA), నాసా (NASA) సూచనల మేరకు ఈ విత్తనాలను తగిన పరిమాణంలో తీసుకెళ్లారు. వరి విత్తనాలు – 20 గ్రాములు, టమాటా, వంకాయ, నువ్వులు, కూట్ల పప్పులు – ఒక్కోటి 4 గ్రాములు చొప్పున తీసుకెళ్లారు.

జ్యోతి: (పట్టాంబి పరిశోధన కేంద్రం)

ఉమ: (మంకొంబు పరిశోధన కేంద్రం)

టమాటా: వెల్లాయణి విజయ్ (వెల్లాయణి వ్యవసాయ కళాశాల)

కుట్ల పప్పు: కనకమణి (పట్టాంబి ప్రాంతీయ పరిశోధన కేంద్రం)

వంకాయ: సూర్య (త్రిస్సూర్ వ్యవసాయ కళాశాల)

నువ్వులు: తిలతార (కాయంకుళం ఓనట్టుకర ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం అభివృద్ధి చేసింది)

ఈ ప్రయోగం ఎందుకు?

ఈ ప్రయోగం ద్వారా విత్తనాలు అంతరిక్ష పరిస్థితుల్లో ఎలా ప్రతిస్పందిస్తాయి?. ఎలా మనుగడ సాగిస్తాయో తెలుసుకోవచ్చు. భూమికి తిరిగి వచ్చిన తర్వాత మొలకెత్తించి, వాటిలో సంభవించిన శారీరక, జన్యు మార్పులను విశ్లేషిస్తారు. భారతదేశం ఈ తరహా ప్రయోగాన్ని మొదటిసారిగా చేపడుతోంది. గతంలో చైనా ఇలాంటి ప్రయోగాలు చేసింది. ఇప్పటి వరకు భారతదేశం నుంచి విత్తనాలు అంతరిక్షానికి వెళ్లడం ఇదే మొదటిసారి. ఈ ప్రయోగం విజయం సాధిస్తే అది కేవలం కేరళకే కాకుండా దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగానికి శాస్త్రీయ పురోగతిలో ఓ మైలురాయి అవుతుంది. అటు శుభాంశు సైతం చరిత్రలో నిలిచిపోతారు.

Tags

Next Story