Delhi Farmers Strike : ఢిల్లీలో మళ్లీ రైతుల ఆందోళనలు..

Delhi Farmers Strike :మోదీ సర్కారుపై రైతులు మరోసారి సమరభేరి మోగించారు. తమ డిమాండ్ల సాధనకు మళ్లీ పోరుబాట పట్టారు. దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహా పంచాయత్ పేరుతో నిరసన దీక్షకు రైతులు పిలుపునిచ్చారు. ఇవాళ్టి నిరసనకు సిద్ధమైన రైతులు.. ఇప్పటికే ఢిల్లీకి చేరుకుంటున్నారు. దీంతో ఢిల్లీ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఢిల్లీ-హర్యానా సరిహద్దుల్లో పోలీసులు... కాంక్రీట్ బారీకేడ్లు ఏర్పాటు చేసి భద్రతను కట్టుదిట్టం చేశారు. దేశ రాజధానిలోకి ప్రవేశించే వాహనాలను విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. వాహనదారుల వివరాలను పరిశీలించిన తర్వాతే పోలీసులు వారిని వదులుతున్నారు.
దాదాపు 40 వ్యవసాయ సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా పేరిట ఒకే గొడుగు కిందకు వచ్చి.. తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళనకు దిగుతున్నారు. ప్రధానంగా పంటలకు కనీస మద్దతు ధరను సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో 72 గంటల దీక్షకు దిగారు. తమ డిమాండ్లను నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని మండిపడుతున్నారు రైతులు. అంతకుముందు జూలై 31 న పంజాబ్‌లోని రైతులు... బటిండాలో, అమృత్‌సర్‌లోని వల్లా వద్ద రైల్వే ట్రాక్‌ను అడ్డుకున్నారు. అంబాలాలోని శంభు టోల్ ప్లాజా, పంచకుల బర్వాలా, కైతాల్ చీకా వద్ద నిరసన తెలిపారు.
జంతర్‌మంతర్ వద్ద జరిగే నిరసనలో పాల్గొనేందుకు దేశ రాజధానిలో అడుగుపెట్టిన రైతు నాయకుడు రాకేష్ తికాయత్‌ను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జంతర్ మంతర్‌కు వెళ్తుండగా ఘాజీపూర్‌లో తికాయత్‌ను అడ్డుకున్నారు. ప్రభుత్వ ఆదేశానుసారం పని చేస్తున్న ఢిల్లీ పోలీసులు... రైతుల గొంతును అణచివేయలేరని, ఈ అరెస్టు కొత్త విప్లవాన్ని తెస్తుందన్నారు రాకేష్ తికాయత్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com