Indian Navy Intense Operation: భారత నేవీ ఇంటెన్స్ ఆపరేషన్-

భారత నేవీ మరోసారి సముద్రపు దొంగల ఆట కట్టించింది. నౌకలను దోచుకునేందుకు వారు చేసిన యత్నాలను అడ్డుకుని 35 మంది సముద్రపు దొంగలను తమ ఆధీనంలోకి తీసుకుంది. MV రుయెన్ నౌకలోని 17 మంది సిబ్బందిని కాపాడింది. భారత బలగాలకు, సముద్ర దొంగలకు మధ్య జరిగిన పోరాట దృశ్యాలను భారత నౌకాదళం తాజాగా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది..
సముద్ర దొంగలు హైజాక్ చేసిన MV రుయెన్ వాణిజ్య నౌకను సముద్రపు దొంగల చెర నుంచి విడిపించిన దృశ్యాలను భారత నౌకాదళం సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. ఆ నౌకలోని 35 మంది సముద్రపు దొంగలను భారత నేవీ తమ ఆధీనంలోకి తీసుకుంది. 17 మంది సిబ్బందిని కాపాడింది. ఇండియన్ నేవీ అధికారులు భారత యుద్ధ నౌక INS కోల్‌కతాలో వెళ్లి ఈ ఆపరేషన్‌ను చేపట్టారు. ఇందులో భాగంగా రవాణా విమానం C-17 గ్లోబ్‌మాస్టర్ నుంచి ధైర్యంగా పారాచూట్‌ల సాయంతో సముద్ర ఉపరితలంపైకి నేవీ కమాండోలు దూకారు. అనంతరం ప్రత్యేకమైన బోట్లలో హైజాక్ అయిన నౌక వద్దకు చేరుకున్నారు. ఆ నౌకను దొంగల చెర నుంచి విడిపించిన భారత నౌకాదళం బందీలు, సిబ్బందితో సహా నౌకను ఇండియన్ వెస్ట్‌కోస్ట్ వైపునకు తీసుకొస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నౌకలో భారీగా ఉక్కు ఉన్నట్లు పేర్కొన్నారు.
పశ్చిమ హిందూ మహాసముద్రంలో గత కొన్ని వారాలుగా పలు వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులను భారత నౌకాదళం అడ్డుకొని వాటిలోని సిబ్బందిని రక్షించింది. సోమాలియా తూర్పు తీరం వెంట జనవరిలో 19 మంది పాక్ సిబ్బందితో వెళ్తున్న నౌకపై దాడి జరగ్గా..అందులోని సిబ్బందిని భారత నేవీ ఐఎన్‌ఎస్ సుమిత్రా యుద్ధనౌక ద్వారా కాపాడింది. జనవరి 5న లైబీరియన్ జెండాతో అరేబియా సముద్రంలో వెళ్తున్న నౌకను హైజాక్ చేసేందుకు సముద్రపు దొంగలు యత్నించగా దానిని నౌకాదళం నిలువరించింది. కీలకమైన సముద్రమార్గాలను దృష్టిలోపెట్టుకొని భారత నౌకాదళం ఫ్రంట్‌లైన్ నౌకలు, నిఘా విమానాలతో సముద్ర భద్రతను విస్తృత పరిచింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com