President Elections : దేశ ప్రధమ పౌరుడి ఎన్నిక రేపే.. అంతా రెడీ..

President Elections : దేశ ప్రధమ పౌరుడి ఎన్నిక రేపే.. అంతా రెడీ..
President Election : దేశ ప్రథమ పౌరుడయిన రాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమయింది.

President Election : దేశ ప్రథమ పౌరుడయిన రాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమయింది.President Election : దేశ ప్రథమ పౌరుడయిన రాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమయింది.రేపు జరిగే రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం 8 గంటలకు మాక్‌ పోలింగ్ నిర్వహిస్తారు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రపతి పోలింగ్ జరుగుతుంది.

బ్యాలెట్‌ విధానంలో జరిగే ఈ ఎన్నికలో ఎమ్మెల్యేలు, ఎంపీలే ఓటర్లుగా ఉంటారు. ప్రాతినిథ్యం వహిస్తున్న రాష్ట్రాన్ని బట్టి ఓటు విలువను కలిగి ఉంటారు. ఈ నేపథ్యంలో ఎంపీలు, ఎమ్మెల్యేల ఓటును గుర్తించేందుకు వీలుగా రెండు రకాల బ్యాలెట్‌ పేపర్‌లలో ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఇందుకు అనుగుణంగా ఆకుపచ్చ, పింక్‌ రంగులతో కూడిన బ్యాలెట్‌ పేపర్లు ఇప్పటికే వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు చేరుకున్నాయి.

ఆకుపచ్చ బ్యాలెట్‌ పేపర్‌లో ఎంపీలు, పింక్‌ బ్యాలెట్‌ పేపర్‌లో ఎమ్మెల్యేలు తమ ఓటును వేస్తారు. బ్యాలెట్‌ పేపర్ రంగు ద్వారా ఎంపీ, ఎమ్మెల్యేల ఓట్లను గుర్తించి వాటి విలువను లెక్కగట్టి పరిగణలోకి తీసుకుంటారు. ఈ నెల 21న ఓట్ల లెక్కింపు జరగనుంది.

రాష్ట్రపతి ఎన్నికల ఎలక్టొరల్ కాలేజీలో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేలు కలిపి మొత్తం 4 వేల 809 మంది ఓటర్లు ఉంటారు. వీరిలో లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు 776 మంది కాగా...ఎమ్మెల్యేల సంఖ్య 4 వేల 33. నామినేటెడ్ సభ్యులకు ఓటు హక్కు ఉండదు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు విలువను 1971 జనాభా లెక్కల ఆధారంగా నిర్ధారిస్తారు.

జనాభా, శాసనసభ స్థానాలను బట్టి ఆయా రాష్ట్రాలను ఆయా రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓటు విలువ మారుతుంటుంది. యూపీకి చెందిన సగటు ఎమ్మెల్యే ఓటు విలువ 208గా ఉండగా..జార్ఖండ్‌, తమిళనాడు రాష్ట్రాలకు 176గా ఉంది. అలాగే మహారాష్ట్రలో 175, సిక్కిం 7, మిజోరాం 8, నాగాలాండ్‌ 9గా ఎమ్మెల్యే ఓటు విలువ ఉంది.

ప్రస్తుతం ఏపీలో ఎమ్మెల్యే ఓటు విలువ 159 కాగా...తెలంగాణ ఎమ్మెల్యే ఓటు విలువ 132గా ఉంది. ప్రస్తుతం ఎంపీల ఓటు విలువ 700గా ఉంది. ఎంపీల మొత్తం ఓటు విలువ 5 లక్షల 43 వేల 200గా ఉండగా..ఎమ్మెల్యేల ఓటు విలువ 5 లక్షల 43 వేల 231గా ఉంది. మొత్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేల ఓటు విలువ పది లక్షల 86 వేల 431గా ఉంది. ఇందులో మెజార్టీ ఓట్లు సాధించిన అభ్యర్థి రాష్ట్రపతిగా ఎన్నికవుతారు.

ఇక రాష్ట్రపతి ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్డీఏ కూటమి....ఒడిశాకు చెందిన గిరిజన మహిళ ద్రౌపది ముర్మును అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో దేశ చరిత్రలో తొలిసారి ఓ గిరిజన వ్యక్తికి రాష్ట్రపతి పీఠం అధిష్టించే అవకాశం దక్కినట్లయింది. ఇక ఎన్డీఏ కూటమికి 49 శాతానికిపైగా బలం ఉండగా....వైసీపీ, తెలుగు దేశం, జార్ఖండ్ ముక్తి మోర్చా, శోరోమణి అకాళీ దళ్‌, బీఎస్పీ, శివసేన పార్టీలు మద్దతు ప్రకటించాయి. దీంతో దాదాపు రాష్ట్రపతిగా ముర్ము ఎన్నిక లాంఛనం కానుంది.

ఇక విపక్షాల తరపున మాజీ కేంద్రమంత్రి యశ్వంత్‌ సిన్హా రాష్ట్రపతిగా బరిలోకి దిగారు. ఐతే యశ్వంత్‌ సిన్హాకు కాంగ్రెస్‌తో పాటు టీఎంసీ, తెలంగాణ రాష్ట్ర సమితి, డీఎంకే, ఆమ్‌ ఆద్మీ పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఆమ్‌ ఆద్మీ పార్టీ ఢిల్లీతో పాటు పంజాబ్‌లో అధికారంలో ఉంది. పంజాబ్‌లో 92 మంది ఎమ్మెల్యేలు ఉండగా...ఢిల్లీలో 62 మంది, గోవాలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. డీఎంకే తమిళనాడులో, టీఎంసీ బెంగాల్‌లో, టీఆర్ఎస్ తెలంగాణలో అధికారంలో ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story