Vande Bharat: వందే భారత్ స్లీపర్..ఎలా ఉండబోతోందంటే..

Vande Bharat: వందే భారత్ స్లీపర్..ఎలా ఉండబోతోందంటే..
అద్భుతమైన ఇంటీరియర్‌తో విశాలంగా, లగ్జరీగా ..

దేశవ్యాప్తంగా ఉత్సాహంగా పరుగులు పెడుతున్న వందేభారత్ సెమీ స్పీడ్ రైళ్లకు స్లీపర్ కోచ్‌ రైళ్లు కూడా జత కట్టనున్నాయి. ఈ ఏడాది డిసెంబరు నాటికి స్లీపర్ ఎడిషన్ వందేభారత్ ప్రొటోటైప్ సిద్ధమవుతుందని, మార్చి 2024 నాటికి రైళ్లు అందుబాటులోకి వస్తాయని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా, స్లీపర్ రైలుకు సంబంధించిన ఫొటోలను ఆయన ఎక్స్‌లో షేర్ చేశారు. అత్యద్భుతంగా ఉన్న ఈ కోచ్ ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.


దేశంలోని ప్రధాన నగరాల మధ్య వేగవంతమైన ప్రయాణం కోసం కేంద్రం వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ వందే భారత్ రైళ్లలో కూర్చొని ప్రయాణించే అవకాశం మాత్రమే ఉంది. చైర్ కార్, ఎగ్జి్క్యూటివ్ చైర్ కార్ క్లాసులు మాత్రమే ఉన్నాయి. కానీ త్వరలోనే స్లీపర్ వందే భారత్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. విశాలంగా, లగ్జరీగా ఉన్నఈ కోచ్‌లు ఆకట్టుకుంటున్నాయి. ఇంటీరియర్ మరింత ఆకర్షణీయంగా ఉంది. రాత్రిపూట ప్రయాణించే వారికి అత్యంత సౌకర్యంగా ఉండేలా బెర్త్‌లను తీర్చిదిద్దారు. వచ్చే ఏడాది మార్చిలో పట్టాలపైకి రాబోతున్న స్లీపర్ కోచ్ రైలులో మొత్తం 857 బెర్త్‌లు ఉంటాయి. వీటిలో ప్రయాణికుల కోసం 823, సిబ్బంది కోసం 34 అందుబాటులో ఉంటాయి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో వీటిని నిర్మిస్తున్నారు.


వందే భారత్ స్లీపర్ రైళ్లను చెన్నైలోని ఇంటీగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ ఫ్యాక్టరీ మాన్యుఫాక్చర్ చేస్తున్నాయి. ప్రస్తుతమున్న వందే భారత్ రైళ్లతో పోలిస్తే.. స్లీపర్ రైళ్లలో స్ట్రక్చరల్ డిజైన్‌లో చాలా మార్పులు ఉండనున్నాయి. ఒక్కో వందే భారత్ స్లీపర్ రైలులో 22 లేదా 24 బోగీలు ఉంటాయి. అప్పర్ బెర్త్‌లకు ఎక్కేందుకు ఏర్పాటు చేసే మెట్లను సైతం అందంగా డిజైన్ చేయనున్నారు. సాధారణ రైళ్లలో ఒక బోగీలో నాలుగు టాయిలెట్లు ఉంటాయి. కానీ వందే భారత్ స్లీపర్ రైళ్లలో మూడు టాయిలెట్లు మాత్రమే ఉంటాయి. నాలుగో టాయిలెట్ బదులు మినీ ప్యాంట్రీని ఏర్పాటు చేస్తారు.



ప్రస్తుతం కూర్చునే సౌలభ్యంతో 33 వందే భారత్ రైళ్లు దేశవ్యాప్తంగా ప్రయాణికులకు అందుబాటులో ఉండగా.. వీటి సంఖ్యని 75కి పెంచనున్నారు. వీల్ చైర్లలో వెళ్లేవారికి, సీనియర్ సిటిజన్లకు సౌకర్యవంతంగా ఉండేందుకు రైల్వే శాఖ ట్రెయిన్లలో ర్యాంపు‌లను ఏర్పాటు చేయనుంది. కొత్త డిజైన్ చేసిన ర్యాంప్‌లకు సంబంధించిన ఫొటోలను ఇటీవలే రిలీజ్ చేసింది.

Tags

Read MoreRead Less
Next Story