SAMUDRAYAN: ఈ ఏడాదే సముద్ర యాన్

చంద్రయాన్, గగన్‌యాన్, ఆదిత్య ఎల్ వన్ ప్రయోగాలతో దూసుకుపోతున్న భారత్.. మరో కీలక ప్రకటన చేసింది. సముద్ర గర్భ అన్వేషణ కోసం భారత్ చేపడుతున్న తొలి మానవ సహిత డీప్ ఓషన్ మిషన్ సముద్రయాన్’ ప్రాజెక్ట్‌ను వచ్చే ఏడాది చివరికల్లా చేపడతామని కేంద్ర భూ విజ్ఞానశాస్త్ర శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. సముద్ర మట్టం నుంచి ఆరు వేల మీటర్ల లోతులోకి వెళ్లి పరిశోధకులు అధ్యయనం చేస్తారని కిరణ్ రిజిజు ప్రకటించారు. సముద్రయాన్ కోసం ‘మత్య్స’ అనే జలాంతర్గామిని సిద్ధం చేస్తున్నామని వివరించారు. దీని ద్వారా ముగ్గురు శాస్త్రవేత్తల బృందం సముద్ర జలాల్లో ఆరు వేల మీటర్ల లోతులోకి ప్రయాణిస్తారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పనులు తుది దశలో ఉన్నాయి. 2025 చివరికల్లా ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని కిరణ్ రిజిజు వెల్లడించారు.
2023 సెప్టెంబర్ 11న చెన్నైలోని ఎన్‌ఐఓటీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన తర్వాత భారత్ ఈ మిషన్‌ను ఆవిష్కరించేందుకు సిద్ధంగా ఉందని కేంద్ర భూ శాస్త్ర మంత్రి కిరణ్ రిజిజు సోషల్ మీడియాలో వెల్లడించారు. ‘‘ఈ జలాంతర్గామి సముద్ర జీవ వైవిధ్యానికి ఎలాంటి హాని కలిగించదు. ప్రధాన మంత్రి బ్లూ ఎకానమీ లక్ష్యాలను ఈ మిషన్ మరింత బలోపేతం చేస్తుంది’’ అని తెలిపారు. ఈ ప్రాజెక్టు గురించి క్లుప్తంగా చెప్పాలంటే... భారత్ ఏకకాలంలో ‘గగన్‌యాన్’ ద్వారా అంతరిక్షంలోకి, ‘సముద్రయాన్’ ద్వారా సముద్ర గర్భంలోకి అక్కడి రహస్యాల గుట్టును విప్పేందుకు మానవ సహిత మిషన్లను పంపించేందుకు సిద్ధమవుతుందన్నమాట.
సముద్రజలాల్లోని వనరులు, జీవ వైవిధ్యంపై అధ్యయనం కోసం 2021లో కేంద్ర ప్రభుత్వం ‘సముద్రయాన్’ ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. మత్స్య జలాంతర్గామిని చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీలో తయారు చేస్తున్నారు. ఇందులో ఆధునిక సెన్సర్లు, టూల్స్ ఉంటాయి. ఇది 12 గంటలపాటు పనిచేస్తుంది. అత్యవసర సమయాల్లో దీని సామర్థ్యాన్ని 96 గంటలకు పెంచవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, జపాన్ దేశాలు ఈ ప్రాజెక్టులను విజయవంతంగా చేపట్టాయి. సముద్రయాన్ విజయవంతంగా చేపట్టడం ద్వారా భారత్ ఆ దేశాల సరసన చేరనుంది. సముద్ర గర్భాన్ని పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డీప్ ఓషన్ మిషన్‌లో సముద్రయాన్ ప్రాజెక్ట్ ఒక ముఖ్యమైన భాగం. డీప్ ఓషన్ మిషన్‌ను ఎన్ఐఓటీ అమలు చేస్తోంది. దీని ఖర్చు మొత్తంగా రూ.4,077 కోట్లు. ఈ మిషన్ కింద, ఎన్‌ఐఓటీ అంతకుముందు 2022 డిసెంబర్‌లో సాగర్ నిధి పేరుతో ఒక నౌకను హిందూ మహాసముద్రంలోకి పంపింది. ఈ నౌకలో రోబోటిక్ సబ్‌మెరైన్ ఓఎంఈ 6000 ఏయూవీ(ఓషన్ మినరల్ ఎక్స్‌ప్లోరర్) 5,271 మీటర్ల లోతుకు వెళ్లింది. అక్కడున్న మాంగనీస్ ఓర్ కోసం వెతికింది. అదే మిషన్ కింద మరో దశను ఎన్ఐఓటీ చేపడుతోంది. ఈసారి ముగ్గురు భారతీయులతో ఒక చిన్న ఆటోమేటిక్ జలాంతర్గామి అంటే సబ్‌మెర్సిబుల్ సముద్రంలోకి వెళ్తుంది. ఈ ప్రాజెక్టును సముద్రయాన్ అని కూడా పిలుస్తారు. 2019లోనే సముద్రయాన్ మిషన్ ప్రారంభమైంది. 2020లో దీని పనిని మొదలు పెట్టారు. 2025-26 కల్లా ఈ జలాంతర్గామిని సముద్ర గర్భంలోకి పంపాలని భారత్ అంతకుముందు ప్లాన్ చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com