Aditya L1: భూమి, చంద్రుడి ఫొటోలు పంపించిన ఆదిత్య ఎల్-1

Aditya L1: భూమి, చంద్రుడి ఫొటోలు పంపించిన ఆదిత్య ఎల్-1
సెల్ఫీ తీసుకున్న ఆదిత్య L1 మిషన్.. వీడియో షేర్ చేసిన ఇస్రో

భారతదేశం ఎంతో ప్రతిష్టాత్మంగా చేపట్టిన ఆదిత్య ఎల్1 సోలార్ మిషన్ దిగ్విజయంగా తన లక్ష్యం వైపు కదులుతోంది. సూర్యుడి రహస్యాలను అధ్యయనం చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఆదిత్య ఎల్-1 మిషన్ ను చేపట్టిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 2న శ్రీహరికోట నుంచి మిషన్ ప్రయోగాన్ని చేపట్టింది. ప్రస్తుతం ఆదిత్య ఎల్-1 భూకక్ష్యలో తిరుగుతోంది . తాజాగా ఆదిత్య ఎల్1 ఆన్ బోర్డ్ కెమెరాల సాయంతో సెల్ఫీ తీసింది. దీంతో భూమి, చంద్రుడు కనిపించడం చూడొచ్చు. చంద్రుడు భూమికి కుడి వైపున చిన్న చుక్కలా ఉన్నాడు. దీనికి సంబంధించిన వీడియోను ఇస్రో తన ఎక్స్ అకౌంట్ లో షేర్ చేసింది. ఫొటోలో.. VELC, SUIT అనే ఇన్‌స్ట్రుమెంట్లను మనం చూడవచ్చు అని ఇస్రో తెలిపింది. అలాగే ఆదిత్యకు ఉన్న ఆన్ బోర్డ్ కెమెరా.. భూమి, చందమామను ఫొటోలు తీసింది. ఐతే.. వరుస ఫొటోలను ఆర్డర్‌లో సెట్ చెయ్యడం వల్ల అవి వీడియో లాగా కనిపిస్తున్నాయి.


సెప్టెంబర్ 2న ఆంధ్రప్రదేశ్ శ్రీహరి కోట నుంచి పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి ఆదిత్య ఎల్1ని తీసుకెళ్లింది. చంద్రయాన్-3 సక్సెస్ అయిన తర్వాత ఇస్రో కొన్ని రోజుల వ్యవధిలోనే ఈ సోలార్ మిషన్‌ని ప్రయోగించింది. భూమి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో తిరుగుతున్న ఆదిత్య ఎల్1 శాటిలైట్ కక్ష్యను రెండుసార్లు విజయవంతంగా ఇస్రో పెంచింది. భూకక్ష్యను దాటిన తర్వాత అది సూర్యుడి దిశగా పయనిస్తుంది. 125 రోజులు 15 లక్షల కి.మీ. ప్రయాణించి ఎల్1 పాయింట్ కు చేరుకుంటుంది. అక్కడి నుంచి సూర్యుడిపై పరిశోధనలు చేస్తుంది.

ఇలా పలు దఫాలుగా కక్ష్యను పెంచి భూమి గురుత్వాకర్షణ శక్తిని దాటే వేగం వచ్చిన తర్వాత ఆదిత్య ఎల్ 1 భూమి, సూర్యుడు మధ్య ఉండే లాంగ్రేజ్ పాయింట్ 1(L1) వద్దకు ప్రయాణమైంది. ఇది భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎల్1 పాయింట్ వద్ద హాలో కక్ష్యలో తిరుగుతూ సూర్యుడి కరోనా, మాగ్నెటిక్ ఫీల్డ్, సౌర తుఫానులపై అధ్యయనం చేయనుంది. అక్కడికి చేరుకునేందుకు దాదాపుగా ఆదిత్య ఎల్ 1కి 4 నెలల సమయం పడుతుంది. ఎల్1 పాయింట్ వద్ద సూర్యుడు, భూమి గురుత్వాకర్షణ శక్తి సమతుల్యంగా ఉంటుంది. అందుకే ఆదిత్య ఎల్ 1ని అక్కడ ఉంచుతున్నారు. ప్రస్తుతానికి ఆదిత్య భూకక్ష్యలోనే తన పనిని ప్రారంభించింది. తన సెల్ఫీని తీసుకుంది. అదే విధంగా భూమి, చంద్రుడి ఫొటోలను తీసింది. వీటిని ఇస్రోకు పంపించింది.

Tags

Read MoreRead Less
Next Story