Indigo: ఇండిగో బంపర్ ఆఫర్.. బస్ టికెట్ ధరకే ఫ్లైట్ జర్నీ!

Indigo: ఇండిగో బంపర్ ఆఫర్.. బస్ టికెట్ ధరకే ఫ్లైట్ జర్నీ!
X
దేశీయ ప్రయాణ టికెట్లు కేవలం రూ. 1299 నుంచే

విమాన ప్రయాణం చేయాలనుకునే వారికి ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో శుభవార్త చెప్పింది. సామాన్యులకు కూడా విమానయానాన్ని అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో "గ్రాండ్ రన్‌అవే ఫెస్ట్" పేరుతో ప్రత్యేక సేల్‌ను ప్రారంభించింది. ఈ ఆఫర్ కింద దేశీయ మార్గాల్లో వన్-వే ప్రయాణానికి టికెట్ ధరలను కేవలం రూ. 1,299 నుంచే అందిస్తున్నట్టు ప్రకటించింది.

ఈ ప్రత్యేక సేల్‌లో భాగంగా, అంతర్జాతీయ రూట్లలో ప్రయాణానికి టికెట్ ధరలు రూ. 4,599 నుంచి ప్రారంభమవుతాయని ఇండిగో సంస్థ తెలిపింది. ఇవి ఎకానమీ క్లాస్ ధరలు కాగా, బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించాలనుకునే వారు సుమారు రూ. 9,999 వెచ్చించాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ ఈ నెల‌ 15న ప్రారంభమైంది. ప్రయాణికులు ఈ నెల‌ 21లోపు టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఇప్పుడు టికెట్లు బుక్ చేసుకున్న వారు వ‌చ్చే ఏడాది జనవరి 7 నుంచి మార్చి 31 మధ్య కాలంలో ప్రయాణించేందుకు వీలు కల్పించారు. తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు అనుకూలంగా కడప-హైదరాబాద్, కడప-విజయవాడ, హైదరాబాద్-సేలం, జగదల్‌పూర్-హైదరాబాద్ వంటి పలు కీలక రూట్లలో ఈ ఆఫర్ అందుబాటులో ఉందని సంస్థ పేర్కొంది. వీటితో పాటు దేశవ్యాప్తంగా అనేక ఇతర మార్గాల్లో కూడా ఈ రాయితీ ధరలు వర్తిస్తాయని తెలిపింది.

ఈ ఆఫర్ టికెట్లను ఇండిగో అధికారిక వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని సంస్థ స్పష్టం చేసింది. అంతేకాకుండా +91 7065145858 నంబరుకు వాట్సాప్ ద్వారా కూడా టికెట్లు బుక్ చేసుకునే సదుపాయం కల్పించింది. టికెట్లతో పాటు అదనపు సేవల (యాడ్-ఆన్స్) పైన కూడా ప్రత్యేక రాయితీలు అందిస్తున్నట్లు ఇండిగో వెల్లడించింది.

Tags

Next Story