భారత్‌ సరికొత్త వ్యూహాలు.. కంత్రీ చైనా ఆగడాలకు చెక్

భారత్‌ సరికొత్త వ్యూహాలు.. కంత్రీ చైనా ఆగడాలకు చెక్
కంత్రీ చైనా ఆగడాలకు చెక్‌ పెట్టేందుకు భారత్‌ వ్యూహాలు రచిస్తోంది. ఎంతటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు..

కంత్రీ చైనా ఆగడాలకు చెక్‌ పెట్టేందుకు భారత్‌ వ్యూహాలు రచిస్తోంది. ఎంతటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సైతం ఆర్మీకి ఫ్రీ హ్యాండ్‌ ఇచ్చింది. ఎల్‌ఏసీ దగ్గర పహారా కాస్తున్న సైనికుల కోసం సామగ్రి తరలిస్తోంది. ఇప్పటికే కమొడిటీస్‌, ఆహారం, ఆయుధాలకు సబంధించి విడి భాగాలు, ఇతర అత్యవసర సామగ్రిని అందించాయి ప్రత్యేక హెలికాఫ్టర్లు. చైనా కుయుక్తులను తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉంది.

చైనా తన వైఖరిని ఏ మాత్రం మార్చుకోవడం లేదు. లద్దాఖ్‌ సరిహద్దులోని దక్షిణ పాంగాంగ్ సరస్సు సమీపంలోని ఎత్తైన ప్రాంతాల్లో చొరబాటుకు యత్నించి భారత ఆర్మీ చేతిలో భంగపడిన ఆ దేశ ఆర్మీ మరో కుతంత్రానికి ప్రయత్నిస్తున్నది. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు వైపున తన బలగాలను చైనా మోహరిస్తున్నది. అక్కడి లోయ ప్రాంతాల్లో చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కదలికలను భారత నిఘా వ్యవస్థలు గుర్తించాయి. ఆర్మీని అప్రమత్తం చేయడంతో ఆ ప్రాంతాల్లోని సైనిక స్థావరాలను పటిష్ఠం చేసింది. దక్షిణ పాంగాంగ్ సరస్సు సమీపంలోని కీలకమైన ఎత్తైన ప్రాంతాల స్వాధీనానికి చైనా ఆర్మీ ప్రయత్నించగా భారత్ అడ్డుకున్నది. అనంతరం అక్కడి కీలక ప్రాంతాలను తన ఆధీనంలోకి తెచ్చుకున్నది. భారత సైన్యం వ్యూహాత్మక ప్రాంతాల్లో ఉండటంతో చైనా వెనక్కి తగ్గింది.

అటు సరిహద్దులోని ఇతర ప్రాంతాల్లో చొరబాట్లపై కన్నేసింది చైనా. దీంతో భారత్ సరిహద్దులోని లద్దాఖ్‌ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు అన్నిచోట్ల ప్రత్యర్థుల కదలికలపై పటిష్ఠమైన నిఘా ఉంచింది. ఆయా ప్రాంతాల్లో సైనిక పటిష్ఠతను పెంచారు. సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించుకుని, శాంతియుత వాతావరణం కోసం బలగాలు తగ్గించుకునేందుకు ఇరు దేశాల మధ్య పలు విడతలుగా చర్చలు జరుగుతున్నాయి.

భారతదేశం శాంతిని కోరుకుంటుంది, అదే సమయంలో తనను దెబ్బతీయాలనుకున్నవాళ్ళని ఉతికి ఆరేస్తుందన్నారు కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌. దొంగ దెబ్బతీయడానికి ప్రయత్నించిన చైనా సైనికులకు మన సైనికులు ఈ విషయాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించారన్నారు. చైనా ఆగడాలను భారత దళాలు ఎదుర్కొంటున్న తీరును ఆయన పార్లమెంట్‌లో వివరించారు. తూర్పు లద్దాఖ్‌లో చైనాతో నెలకొన్న ప్రతిష్టంభనను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు భారత్‌ కట్టుబడి ఉందన్నారు. పొరుగు దేశం తనంతట తానుగా ఏకపక్షంగా యథాతథ స్థితిని మార్చేందుకు చేసే ప్రయత్నాలు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు.

భారత్‌తో ఘర్షణపూరిత వాతావరణం సృష్టించేలా చర్యలు తీసుకుంటున్న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ గురించి అంతర్జాతీయ పత్రిక 'న్యూస్‌వీక్‌' ఓ ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. ఆయన చైనాలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారత భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారని... కానీ భారత ఆర్మీ వాటన్నింటినీ తిప్పికొడుతోందని పేర్కొంది. దీంతో జిన్ పింగ్ చేస్తోన్న కుట్రపూరిత చర్యలన్నీ బెడిసికొడుతున్నాయని తెలిపింది. జిన్‌పింగ్‌ పరువు దక్కించుకొనేందుకు త్వరలోనే మరో భారీ అతిక్రమణకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించింది.

Tags

Next Story