Earthquake: ఇండోనేషియా సులవెసి ద్వీపంలో 6.1 తీవ్రతతో భూకంపం

ఇండోనేషియాను మరోమారు భారీ భూకంపం కుదిపేసింది. సులవెసి ద్వీపంలో ఈ ఉదయం 6.55 గంటలకు 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఉత్తర సులవెసి ప్రావిన్స్ సమీపంలో భూమికి 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు. అయితే, దీనివల్ల సునామీ ప్రమాదం లేదని అధికారులు ప్రకటించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అంతేకాదు, భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని వార్తలొస్తున్నాయి.
పసిఫిక్ ‘రింగ్ ఆఫ్ ఫైర్’లో ఉన్న ఇండోనేషియాను తరచూ భూకంపాలు భయపెడుతునే వున్నాయి. సులవెసి ద్వీపంలో గతంలో భయంకరమైన భూకంపాలు వచ్చాయి. 2021, జనవరిలో 6.2 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా 100 మందికి పైగా మరణించగా, వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. 2018లో పలులో 7.5 తీవ్రతతో భారీ భూకంపం, సునామీ సంభవించడంతో 2,200 మందికి పైగా మృతి చెందారు. ఇక, 2004లో 9.1 తీవ్రతతో సంభవించిన అత్యంత భయంకరమైన భూకంపం, ఆ వెంటనే సునామీ పోటెత్తడంతో 1.7 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com