Fake notes: ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ నోట్ల దందా

ఇప్పటి వరకు సోషల్ మీడియాను టైం పాస్ వాడినోళ్లను మనం చూసి ఉంటాం.. కానీ వీళ్లు మాత్రం ఒక అడుగు ముందుకేసి నకిలీ నోట్ల దందాకు వాడేస్తున్నారు. అరేయ్ ఎవర్రా మీరంతా అనే ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్ జిల్లాలో వెలుగుచూసింది. అక్కడి స్థానిక పోలీసులు నిందితులను గుర్తించి ఐదుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.2.59 లక్షల విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీనితో పాటు 6 ఫోన్లు, 2 ల్యాప్‌టాప్‌లు, 1 కలర్ ప్రింటర్, ఫోటో కట్టర్, 20 ఖాళీ సెక్యూరిటీ థ్రెడ్ పేపర్లు, 52 షీట్‌లపై తయారు చేసిన నోట్లు, 6 ఆధార్ కార్డులను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.
సహరన్‌పూర్ సిటీ ఎస్పీ వ్యోమ్ బిందాల్ మాట్లాడుతూ.. సహరన్‌పూర్‌లోని కుతుబ్‌షేర్ పోలీసులు, స్వాట్ నిఘా బృందం రెండు రోజుల క్రితం రూ.2.59 లక్షల విలువైన నకిలీ కరెన్సీతో రుబల్, వాన్ష్ అనే ఇద్దరు యువకులను అరెస్టు చేసింది. వారిని విచారించిన తర్వాత మరికొందరి పేర్లు వెలుగులోకి వచ్చాయని చెప్పారు. వాటి ఆధారంగా పోలీసులు జిల్లా పరిధిలోని లోకో పైలట్ శిక్షణా కేంద్రం ముందు ఉన్న ఖాళీ క్వార్టర్స్‌పై దాడి చేశారని పేర్కొన్నారు. దాడిలో కాన్పూర్‌కు చెందిన శశి అలియాస్ సర్వేష్, గోరఖ్‌పూర్‌కు చెందిన నవీన్ పాశ్వాన్, హర్యానాకు చెందిన కర్ణ్‌వీర్ అనే ముగ్గురిని అరెస్టు చేశారని తెలిపారు. నిందితులు రూ.250 చెల్లిస్తే నకిలీ రూ.500 నోట్లు ఇచ్చేవారని, వీరు ఈ దందాను ఇన్‌స్టాగ్రామ్ ఆధారంగా చేస్తున్నారని పేర్కొన్నారు. ముందుగా అరెస్ట్ చేసిన రూబల్, వాన్ష్‌లను విచారించినప్పుడు, వారిద్దరూ తర్వాత అరెస్ట్ చేసిన నిందితుల నుంచి నోట్లు కొనుగోలు చేసి సరఫరా చేసేవారని తేలిందన్నారు. ఈ ముఠా విదేశీ ఆన్‌లైన్ యాప్‌ల నుంచి సెక్యూరిటీ పేపర్‌లను కొనుగోలు చేసి నకిలీ కరెన్సీని తయారు చేస్తున్నట్లు వెల్లడించారు. సోషల్ మీడియా యూజర్స్ వీళ్ల టార్గెట్ అని పేర్కొన్నారు.
నిందితులు నకిలీ నోట్లను అమ్మడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు హాని కలిగిస్తున్నారని ఎస్పీ చెప్పారు. నిందితుల మొత్తం నెట్‌వర్క్‌ను దర్యాప్తు చేస్తున్నామని, నెట్‌వర్క్‌లో ఇంకా ఎంత మంది ఉన్నారనే దానిపై సమాచారం సేకరిస్తున్నట్లు తెలిపారు. కొందరు కేవలం వారి స్వార్థం కోసం మోసాలతో నిండిన సోషల్ మీడియా ప్రకటనలు జారీ చేస్తున్నారని, అలాంటి ప్రలోభాలతో కూడిన ప్రకటలను ప్రజలు వెంటనే నమ్మవద్దని సూచించారు. ఎవరైనా మీమల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని భావిస్తే వెంటనే దాని గురించి స్థానిక పోలీసులకు సమాచారం అందించాలన్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com