Internet Shutdown: భారీ నిరసనలు.. శ్రీనగర్‌లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత

Internet Shutdown: భారీ నిరసనలు.. శ్రీనగర్‌లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత
X
కర్ఫ్యూ తరహా ఆంక్షలు.. అదనపు బలగాల మోహరింపు

ఇరాన్ అత్యున్నత నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ మరణం జమ్మూ కాశ్మీర్‌లో తీవ్ర అలజడి సృష్టించింది. ఇజ్రాయెల్, అమెరికా జరిపిన దాడుల్లో ఖమేనీ మరణించారన్న వార్త తెలియగానే శ్రీనగర్‌లోని పలు ప్రాంతాల్లో ప్రజలు భారీ ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. ఈ నిరసనలు హింసాత్మకంగా మారకుండా ఉండేందుకు, శాంతిభద్రతలను కాపాడేందుకు అధికారులు శ్రీనగర్ అంతటా మొబైల్ ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు లోయలో అదనపు భద్రతా బలగాలను మోహరించారు.

శ్రీనగర్‌తో పాటు కాశ్మీర్ లోయలోని పలు ప్రాంతాల్లో ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు రంగంలోకి దిగడంతో కొన్ని చోట్ల ఘర్షణ వాతావరణం నెలకొంది. భద్రతా బలగాల చర్యలను నిరసిస్తూ నిరసనకారులు నినాదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టే పోస్ట్‌లు వెలువడకుండా ఉండేందుకు అధికారులు మొబైల్ ఇంటర్నెట్ సేవలను స్తంభింపజేశారు.

అకస్మాత్తుగా ఇంటర్నెట్ నిలిపివేయడంతో శ్రీనగర్ నివాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆన్‌లైన్ సేవలు, విద్యార్థుల చదువులు , బ్యాంకింగ్ లావాదేవీలపై ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే పలు సున్నిత ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయడమే కాకుండా, అదనపు బలగాలను మోహరించారు. పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు ఈ ఆంక్షలు కొనసాగే అవకాశం ఉందని అధికారులు సూచించారు. భద్రతా కారణాల దృష్ట్యా కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ లాంటి ఆంక్షలు కూడా విధించినట్లు సమాచారం. ప్రజలు శాంతియుతంగా ఉండాలని, పుకార్లను నమ్మవద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతానికి శ్రీనగర్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ, భద్రతా బలగాలు పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాయి.

Tags

Next Story