Parliament: పార్లమెంట్ గోడ దూకి లోపలికి ఆగంతుకుడు!

ఢిల్లీలోని పార్లమెంట్ భవనం వద్ద భారీ భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. ఈ ఉదయం ఓ ఆగంతుకుడు అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఛేదించి పార్లమెంట్ ప్రాంగణంలోకి ప్రవేశించడం తీవ్ర కలకలం రేపింది. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఉదయం సుమారు 6:30 గంటల సమయంలో రైల్ భవన్ వైపు నుంచి వచ్చిన ఓ వ్యక్తి అక్కడున్న చెట్టు ఎక్కి దాని సాయంతో గోడ దూకి లోపలికి ప్రవేశించాడు. నేరుగా నూతన పార్లమెంట్ భవనంలోని గరుడ గేట్ వద్దకు చేరుకున్నాడు. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడిని ఉన్నతాధికారులు విచారిస్తున్నారు. అతని గుర్తింపు, చొరబాటుకు గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిసిన మరుసటి రోజే ఈ ఘటన జరగడం గమనార్హం. గతంలోనూ ఇలాంటి భద్రతా వైఫల్యాలు చోటుచేసుకున్నాయి. గతేడాది 20 ఏళ్ల యువకుడు ఒకరు పార్లమెంట్ అనెక్స్ భవనం గోడ దూకి లోపలికి ప్రవేశించాడు. అప్పుడు కూడా భద్రతా సిబ్బంది అతడిని పట్టుకోగా, అతని వద్ద ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదు. వరుస ఘటనల నేపథ్యంలో పార్లమెంట్ వద్ద భద్రతా ఏర్పాట్లపై ఆందోళన వ్యక్తమవుతోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com