Assembly Elections 2022: అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా భారత్‌లో పాకిస్తాన్ ఐఎస్‌ఐ కుట్ర..

Assembly Elections 2022: పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్‌ఐ.. భారత్‌లో కుట్రలకు తెరలేపినట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రక్రియను అస్థిరపరిచేందుకు కుతంత్రాలకు పాల్పడుతోంది. దీంతో భారత ఇంటెలిజెన్స్ విభాగం అప్రమత్తమైంది. ఐదు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలపై ఐఎస్‌ఐ గురి పెట్టినట్లు తెలుస్తోంది. పంజాబ్ ప్రధాన లక్ష్యంగా.. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో విధ్వంసాలకు కుట్రలు పన్నింది.
ఇందుకోసం ఖలిస్థానీ ఉగ్రవాద మూకలను ఉసిగొల్పింది. పంజాబ్‌లో ఖలిస్థాన్ అనుకూల సర్కారు ఏర్పాటు పేరుతో రెచ్చగొడుతోంది. ఆయుధాలు, మందుగుండు సరఫరాకు అమెరికా, బ్రిటన్, జర్మనీ కేంద్రంగా పనిచేస్తున్న ఖలిస్థాన్ వేర్పాటువాద మూకలు, ఉగ్ర సంస్థలకు భరోసానిస్తూ.. పేలుళ్లు, మూకదాడులు, కాల్పులకు ప్రేరేపిస్తోంది.
ఐఎస్‌ఐ ప్రేరేపిత ఉగ్రసంస్థలైన లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, ఇండియన్ ముజాహిదీన్, హిజ్బుల్ ముజాహిదీన్‌లను యూపీ, ఉత్తరాఖండ్‌లపై గురిపెట్టాలంటూ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని భారత ఇంటెలిజెన్స్ బ్యూరో గుర్తించి.. ఆయా రాష్ట్రాలను హెచ్చరించింది. దీంతో పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు అప్రమత్తమై నిఘాను పెంచాయి.
ఎల్‌వోసీ మీదుగా పంజాబ్ సరిహద్దులకు పాక్ ద్వారా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, ఐఈడీల తయారీ ముడిపదార్థాలు అందుతాయంటూ ఐఎస్‌ఐ నుంచి ఖలిస్థాన్ ఉగ్రసంస్థలకు సందేశాలు వెళ్లాయి. గత ఏడాది డ్రోన్ల ద్వారా జమ్మూకశ్మీర్‌లోని ఐఏఎఫ్ క్యాంపస్‌లో బాంబుదాడులకు పాల్పడిన నేపథ్యంలో.. ఇప్పుడు భారత్‌కు డ్రోన్లు సవాలుగా మారాయి.
గత ఏడాది పంజాబ్ సరిహద్దుల్లో 60 దాకా డ్రోన్లను బీఎస్‌ఎఫ్ గుర్తించింది. వాటిల్లో కొన్నింటిని గాల్లోనే కాల్చివేసింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ నుంచి డ్రోన్ల ద్వారా ఆయుధాలు, ఐఈడీలను సరఫరా చేసే ప్రమాదముందని ఐబీ హెచ్చరించింది. డ్రోన్ల ద్వారా, రోడ్డు మార్గంలో చేరే మారణాయుధాలు, పేలుడు పదార్థాలను ఇతర ప్రాంతాలకు తరలించే బాధ్యతలను ఐఎస్‌వైఎఫ్, బీకేఐలకు.. ఐఎస్‌ఐ వర్గాలు అప్పగించినట్లు వివరించింది.
అమెరికా, బ్రిటన్, జర్మనీలో ఉంటూ.. ఇక్కడి ఖలిస్థాన్ వేర్పాటువాద ఉద్యమాలకు నిధులు సమకూరుస్తున్న ఉగ్రవాదులు, కేసీఎఫ్, బీకేయూ, కేజెడ్‌ఎఫ్‌కు చెందిన వారితో ఐఎస్‌ఐ టచ్‌లో ఉందని పేర్కొంది.పంజాబ్ వ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియను అస్థిరపరిచేందుకు భారీ విధ్వంసాలకు పాల్పడడానికి ఐఎస్‌ఐ కుట్ర పన్నినట్లు ఐబీ వెల్లడించింది.
ప్రధాన పార్టీలకు చెందిన కొందరు ముఖ్య నేతలు, వీవీఐపీలను టార్గెట్‌గా చేసుకున్నట్లు తెలిపింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోనూ సిక్కు ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో విధ్వంసాలు జరిగే ప్రమాదముందని పేర్కొంది. లూధియానా పేలుడు కేసులో నిందితులు కూడా ఇదే సమాచారాన్ని అందజేశారని వివరించింది. ఎన్నికల నేపథ్యంలో విధ్వంసాలకు పాల్పడేలా కుట్రపన్నిందని హెచ్చరించింది.
పంజాబ్ ఎన్నికల్లో విధ్వంసాలు సృష్టించేందుకు ఐఎస్‌ఐ వ్యూహాలను అమలు చేయడంలో ఐఎస్‌వైఎఫ్ కీలక భూమిక పోషించే అవకాశాలున్నాయి. విదేశాల్లో ఉంటూ.. సిక్కు యువతను తన చేతల్లో పెట్టుకున్న ఐఎస్‌వైఎఫ్ నేత పంజాబ్‌లోని తన నెట్‌వర్క్, స్లీపర్‌సెల్స్‌ను యాక్టివేట్ చేశాడని ఐబీ పేర్కొంది.
పంజాబ్ వ్యాప్తంగా పేలుడు పదార్థాలు, మారణాయుధాలను సరఫరా చేసేందుకు ఇప్పటికే ఈ మూక రూట్‌మ్యాప్ సిద్ధం చేసుకున్నట్లు వెల్లడించింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం బీఎస్‌ఎఫ్ పరిధిని సరిహద్దుల నుంచి 50 కిలోమీటర్లు పెంచిన నేపథ్యంలో.. నిరంతరం అప్రమత్తంగా ఉండాలంటూ సరిహద్దు బలగాలను ఐబీ ఆదేశించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com