Gaza Cease Fire: ఇజ్రాయెల్-హమాస్ మధ్య మరో ఒప్పందం

Gaza Cease Fire: ఇజ్రాయెల్-హమాస్ మధ్య మరో ఒప్పందం
X
రంజాన్ మాస సందర్భంగా కాల్పుల విరమణ కొనసాగించాలన్న అమెరికా - ఇజ్రాయెల్, హమాస్ మద్దతు

రంజాన్ మాసం కొనసాగుతున్న నేపథ్యంలో... ఇజ్రాయెల్, హమాస్ మిలిటెంట్ గ్రూప్ మధ్య తాజాగా మరో ఒప్పందం కుదిరింది. గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం పొడిగింపునకు ఇజ్రాయెల్, హమాస్ పరస్పరం అంగీకరించాయి. గాజాలో కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్-హమాస్ మధ్య కుదిరిన తొలి దశ ఒప్పందం మార్చి 1వ తేదీతో ముగిసింది. రంజాన్ మాసం కావడంతో కాల్పుల విరమణ కొనసాగిస్తే బాగుంటుందని అమెరికా సూచించింది. అమెరికా ప్రతిపాదనకు మద్దతు ఇస్తున్నట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. అటు, హమాస్ కూడా ఆమోదం తెలిపింది.

ఈ ఒప్పందంలో భాగంగా తమ చెరలోని బందీల మృతదేహాలను హమాస్ రెడ్‌క్రాస్‌కు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ప్రతిగా తమ జైళ్లలోని పలువురు పాలస్తీనా ఖైదీలకు ఇజ్రాయెల్‌ స్వేచ్ఛ కల్పించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలోనే రెండో దశ ఒప్పందంపై ఇరువర్గాలో ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. రెండో దశ ఒప్పందాలను తొందరగా పూర్తి చేయాలని ఇజ్రాయెల్‌ వాసులు బిగిన్‌ స్ట్రీట్‌లో నిరసనలకు దిగారు. వీరిలో సంస్థ చెరలో బందీలుగా ఉన్నవారి కుటుంబసభ్యులు ఉన్నారు.

ఇటీవల ఇజ్రాయెల్‌-హమాస్‌ల మధ్య తొలిదశ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా తమ చెరలో ఉన్న 94 మందిలో పలువురు బందీలకు హమాస్‌ స్వేచ్ఛ కల్పించగా ప్రతిగా ఇజ్రాయెల్‌ తమ జైళ్ల నుంచి పాలస్తీనీయులకు విముక్తి కల్పించింది. ఈ దశ ఒప్పందం శనివారంతో ముగిసింది. రెండో దశ ఒప్పందానికి సంబంధిచిన చర్చలు ఈజిప్టు రాజధాని కైరోలో కొనసాగుతున్నాయి. అయితే, ఈ చర్చల్లో ఎలాంటి పురోగతీ లేదని హమాస్ పేర్కొంది. ఇందులో సంస్థ నేరుగా పాల్గొనకపోయినా దాని అభిప్రాయాన్ని మధ్యవర్తులకు తెలపనుంది.

ఒకవైపు గాజాలో శాశ్వత శాంతి కోసం చర్చలు జరుగుతున్న సమయంలో అమెరికా 300 కోట్ల డాలర్ల విలువైన ఆయుధాలను ఇజ్రాయెల్‌కు పంపేందుకు పచ్చజెండా ఊపింది. ఇందులో గాజా యుద్ధంలో హమాస్‌కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌ వాడిన 2 వేల పౌండ్ల బాంబులు కూడా ఉన్నాయి. ఈ ఆయుధాల పంపిణీకి సంబంధించి నోటిఫికేషన్లను కాంగ్రెస్‌కు పంపామని అమెరికా విదేశాంగశాఖ తెలిపింది. వచ్చే ఏడాది ఈ ఆయుధాల సరఫరా ప్రారంభం కానుంది.

Tags

Next Story