Israeli-Hamas War : హమాస్‌ టెన్నెల్స్‌పై ఐడీఎఫ్‌ భీకరదాడులు.

Israeli-Hamas War : హమాస్‌ టెన్నెల్స్‌పై ఐడీఎఫ్‌ భీకరదాడులు.
X
24గంటల్లో 200 మంది మృతి..!

హమాస్‌ అంతమే లక్ష్యంగా గాజాలో...ఇజ్రాయెల్‌ దళాలు మారణహోమం సృష్టిస్తున్నాయి. తాజాగా మరో రెండు శరణార్థి శిబిరాలపై దాడులు జరిపాయి. 24 గంటల్లో 187 మంది చనిపోయారు. కాల్పుల విరమణకు అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నా పట్టించుకోని ఇజ్రాయెల్‌కు...ఆయుధాలు అమ్మేందుకు అమెరికా ఆమోదం తెలిపింది. పాలస్తీనా పౌరులకు ప్రాణహాని కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇజ్రాయెల్‌- హమాస్‌ యుద్ధం ఇప్పుడిప్పుడే ముగిసేలా కనిపించడం లేదు.

వేలాదిగా అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఒకవైపు ప్రపంచ దేశాలు, అంతర్జాతీయ సంస్థలు గగ్గోలు పెడుతున్నా...హమాస్‌ అంతమే లక్ష్యమంటూ గాజాపై ఇజ్రాయెల్‌ విరుచుకుపడుతోంది. ఆయుధాల విక్రయానికి అమెరికా ఆమోదం తెలిపిన నేపథ్యంలో....గాజాపై దాడులను ఇజ్రాయెల్‌ మరింత ఉధృతం చేసింది. తాజాగా రెండు శరాణార్థ శిబిరాలపై...ఇజ్రాయెల్ రక్షణ దళం వైమానిక దాడులు జరిపింది. గత 24 గంటల్లో ఇజ్రాయెల్‌ జరిపిన వైమానిక, భూతలదాడుల్లో 187మంది పాలస్తీనియన్లు మరణించినట్లు గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. యుద్ధం మెుదలైనప్పటి నుంచి ఇప్పటివరకు గాజాలో 85శాతం మంది పాలస్తీనా ప్రజలు వలస వెళ్లారు. శరణార్థి శిబిరాలపై ఇజ్రాయెల్ దళాలు దాడి చేయడంతో మధ్య గాజాలో...దాదాపు లక్షా 50వేల మంది వలస వెళ్లారని ఐక్యరాజ్య సమితి తెలిపింది. ఇప్పటివరకు యుద్ధంలో దాదాపు 21వేల 500 మంది పాలస్తీనా ప్రజలు మరణించగా, మరో 55 వేల 900 మంది గాయపడ్డారని వెల్లడించింది. మృతుల్లో...ఎక్కువ మంది పిల్లలు, మహిళలు ఉన్నట్లు తెలిపింది. 168 మంది తమ సైనికులు కూడా చనిపోయినట్లు ఇజ్రాయెల్‌ తెలిపింది.


ఇజ్రాయెల్‌ను వ్యూహాత్మకంగా కాపాడటమే కాకుండా ఆయుధ అమ్మకాలకు అమెరికా ఆమోదం తెలిపింది. దాదాపు 148 మిలియన్‌ డాలర్ల విలువైన ఆయుధాలు విక్రయించేందుకు ఆమోదం తెలిపినట్లు అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్‌ తెలిపారు. అమెరికా కాంగ్రెస్‌ ఆమోదం లేకుండానే...అత్యవసరంగా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అదే సమయంలో పాలస్తీనా ప్రజలకు ప్రాణహాని జరగకుండా...చర్యలు తీసుకోవాలని ఇజ్రాయెల్‌ను కోరినట్లు బ్లింకెన్‌ తెలిపారు. డిసెంబరు 9న కూడా 106 మిలియన్ల డాలర్ల విలువైన ఆయుధాలు, మందుగుండు సామగ్రిని ఇజ్రాయెల్‌కు విక్రయించేందుకు అమెరికా నిర్ణయం తీసుకుంది

Tags

Next Story