Chandrayan 3: జాబిలికి మరింత చేరువగా

Chandrayan 3: జాబిలికి మరింత చేరువగా
నాలుగో కక్ష్య పెంపు విజయవంతం

చంద్రయాన్-3 ప్రయోగం విజయం దిశగా మరో అడుగు వేసింది. ఇప్పటి వరకు మూడో కక్ష్యలో భూమి చుట్టూ చక్కర్లు కొట్టిన ఈ వ్యోమనౌకకు సంబంధించిన నాలుగో కక్ష్య పెంపును అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) గురువారం విజయవంతంగా పూర్తి చేసింది బెంగుళూరు లోని ఇస్ట్రాక్ కేంద్రం నుంచి ఈ విన్యాసాన్ని నిర్వహించింది. ప్రస్తుతం చంద్రయాన్‌-3 ఉపగ్రహం 51400 కిమీ x 228 కిలోమీటర్ల దూరంలో భూ కక్ష్యలో తిరుగుతోంది.

చంద్రయాన్-3 ప్రయోగం తర్వాత అందుకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పకటిప్పుడు వెల్లడిస్తోంది ఇస్రో. చంద్రయాన్-3కి సంబంధించిన ఐదో, చివరి కక్ష్యను పెంచేందుకు జులై 25న మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల మధ్య చేపడతామని వెల్లడించింది.

జులై 20, అంతర్జాతీయ చంద్ర దినోత్సవం. ఈ సందర్బంగా చంద్రయాన్-3ని చంద్రుడికి మరింత చేరువ చేస్తూ... భారత్ ఈ వేడుక చేసుకుంటోంది అని ఇస్రో ట్విట్టర్ వేదికగా పేర్కొంది. జులై 14న ఈ వ్యోమనౌకను ఎల్వీఎం3-ఎం4 రాకెట్ ద్వారా విజయవంతంగా భూకక్ష్యలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. తరువాత రోజు అంటే జులై 15 న తొలిసారిగా దీని కక్ష్యను పెంచారు. తరువాత ఇప్పటి వరకు దశలవారీగా నాలుగుసార్లు పెంచి.. చంద్రయాన్-3ని చంద్రుడికి చేరవేస్తారు. మొత్తం ఐదు కక్ష్యలు పూర్తయిన అనంతరం ఈ వ్యోమనౌక చంద్రుడి కక్ష్యలోకి వెళ్తుంది. ఈ మూడో దఫా ప్రక్రియ విజయవంతంతో చంద్రయాన్ 3 సజావుగా సాగుతున్నట్లు స్పష్టం అయింది.అంతా అనుకున్నట్లు సాగితే సరిగ్గా 40 రోజుల తరువాత ఆగస్టు 23న సాయంత్రం చంద్రుడిపై ల్యాండర్ అడుగుపెడుతుంది.


అంతకు ముందు స్పేస్ సైన్స్ టెక్నాలజీ అండ్ అవేర్‌నెస్ ట్రైనింగ్ కార్యక్రమంలో ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ మాట్లాడారు. చంద్రయాన్ సజావుగా సాగుతోందని , మరికొద్దిరోజులలో ఇది చంద్రుడిపై వాలుతుందని తెలిపారు. శాస్త్రీయ అంశాలకు సంబంధించి ఇస్రో చంద్రయాన్ 3 అత్యంత ప్రత్యేకమైన ఫలితాలను ప్రపంచానికి అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో సాఫ్ట్ ల్యాండ్ కాకపోవడం వల్లనే చంద్రయాన్-2 విఫలమైన విషయం తెలిసిందే. ఇప్పుడు గనుక ఇది చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండ్ అయితే ఈ ప్రయోగం దాదాపు విజయవంతమైనట్లే.

చైనా, రష్యాలు జంబో రాకెట్లను ఉపయోగించి చంద్రుడిపైకి ఉపగ్రహాలను పంపించాయి. చైనా, అమెరికా ఇందుకోసం దాదాపు వెయ్యి కోట్ల వరకు ఖర్చు చేస్తుండగా ఇస్రో దీనిని రూ.500 నుంచి రూ.600 కోట్లతోనే ప్రయోగం చేపడుతోంది.

Tags

Read MoreRead Less
Next Story