PSLV-C60 Rocket: రేపు సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి PSLV. C-60 రాకెట్ ప్రయోగం..

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి డిసెంబర్ (సోమవారం) 30వ తేదీన రాత్రి 9.58 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ60 రాకెట్‌ను ప్రయోగించేందుకు ఏర్పాట్లు అన్నీ పూర్తి అయ్యాయి. ఈరోజు రాత్రి 8.58 గంటలకు శాస్త్రవేత్తలు కౌంట్‌డౌన్ స్టార్ట్ చేయనున్నారు. 25 గంటల కౌంట్‌డౌన్ తర్వాత సోమవారం రాత్రి 9.58 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ60 రాకెట్‌ను నింగిలోకి ప్రయోగించనున్నారు.
అయితే, ఈరోజు (డిసెంబర్ 29) రాత్రికి బెంగళూరు నుంచి శ్రీహరికోటకు ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ చేరుకోనున్నారు. ఆయన ఆధ్వర్యంలోనే కౌంట్‌డౌన్ ప్రక్రియ స్టార్ట్ చేయనున్నారు. పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో ఇది 62వ ప్రయోగం.. పీఎస్‌ఎల్‌వీ కోర్ అలోన్ దశతో చేసే 18వ ప్రయోగం ఇది. పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో 59 ప్రయోగాలను సక్సెస్ ఫుల్ గా నిర్వహించింది ఇస్రో.
కాగా, పీఎస్‌ఎల్‌వీ రాకెట్ 320 టన్నుల బరువు, 44.5 మీటర్లు ఎత్తు ఉంటుంది. కానీ పీఎస్‌ఎల్‌వీ 60కి స్ట్రాపాన్ బూస్టర్లు లేకపోవడంతో 229 టన్నుల బరువునే నింగిలోకి వెళ్లనుంది. కోర్ అలోన్ దశతోనే ఈ ప్రయోగాన్ని ఆరంభించనున్నారు. ఇక, రెండో దశలో ద్రవ ఇంధనం, మూడో దశలో ఘన ఇంధనం, నాలుగో దశలో ద్రవ ఇంధనంతో రాకెట్‌ను లాంఛ్ చేస్తారు. అయితే, ఇస్రో సొంత సాంకేతిక పరిజ్ఞానంతో స్పాడెక్స్ అనే జంట ఉపగ్రహాలను తయారు చేసింది. వీటికి ఛేజర్, టార్గెట్ అని నామకరణం చేశారు. రెండు ఉపగ్రహాలు 440 కిలోల బరువు ఉండగా.. ఇవి స్పేస్ డాకింగ్, ఫార్మేషన్ ఫ్లయింగ్, మానవ అంతరిక్షయానం, తదితర సేవలకు ఉపయోగపడనున్నాయని ఇస్రో వెల్లడించింది. అలాగే, భవిష్యత్తులో ప్రయోగించే చంద్రయాన్–4లో భారత్ స్పేస్ స్టేషన్ నిర్మాణానికి అవసరమైన డాకింగ్ టెక్నాలజీని పరీక్షించేందుకు ఈ ఉపగ్రహాలు ఉపయోగపడనున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com