Isro: ఇస్రోకూ తప్పని సైబర్ దాడులు

Isro: ఇస్రోకూ తప్పని సైబర్ దాడులు
ఇస్రో చీఫ్ సోమనాథ్ ఏం చెప్పారంటే...

అత్యాధునిక సాప్ట్ వేర్, చిప్ ఆధారిత హార్డ్ వేర్ ను ఉపయోగించే రాకెట్ టెక్నాలజీలో సైబర్ దాడులు జరిగే అవకాశం చాలా ఎక్కువ అని అభిప్రాయపడ్డారు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చైర్మన్ ఎస్. సోమనాథ్. ఇస్రో ప్రతిరోజూ 100 కంటే ఎక్కువ సైబర్ దాడులను ఎదుర్కొంటుందని, అలాంటి దాడులను ఎదుర్కోవడానికి సంస్థ బలమైన సైబర్ సెక్యూరిటీ నెట్ వర్క్ ను కలిగి ఉందని అన్నారు. కేరళ పోలీస్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ రీసెర్చ్ అసోసియేషన్ ఆధ్వర్యంలోజరిగిన అంతర్జాతీయ సైబర్ కాన్ఫరెన్స్ లో సోమనాథ్ మాట్లాడుతూ సాప్ట్ వేర్ తో పాటు, రాకెట్ లలోని హార్డ్ వేర్ చిప్ ల భద్రతపై దృష్టి సారించి వివిధ పరీక్షలతో ఇస్రో ముందుకెళ్తుందని తెలిపారు.

ఇటీవల చంద్రుడి దక్షిణ ధ్రువంపైకి చంద్రయాన్‌ –3ని ప్రయోగించి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండర్‌ దించిన తొలి దేశంగా భారత్‌పేరు తెచ్చికుంది. ఈ నేపథ్యంలో ఇస్రో మానవ సహిత గగన్‌ యాన్‌ యాత్రలకు శ్రీకారం చుడుతోంది. మరోవైపు ఇస్రోను టార్గెట్‌ గా చేసుకుని సైబర్‌ దాడులు కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా శత్రు దేశాలు చైనా, పాకిస్థాన్‌ లతోపాటు అంతర్జాతీయ సైబర్‌ నేరగాళ్లు ఈ పనులకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చీఫ్‌ సోమనాథ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇస్రోపై రోజుకి 100కి పైగా సైబర్‌ దాడులు జరుగుతున్నాయని బాంబుపేల్చారు.


గతంలో తమకు ఒక ఉపగ్రహాన్ని పర్యవేక్షించే విధానం ఉండేదని, కానీ, ఇప్పుడు ఒకేసారి అనేక ఉపగ్రహాలను పర్యవేక్షించే సాప్ట్ వేర్ అందుబాటులోకి వచ్చిందని చెప్పారు. ఇది, ఈ రంగం వృద్ధిని సూచిస్తుందని అన్నారు. నావిగేషన్, మెయింటెనెన్స్ తదితరాల కోసం వివిధ రకాల ఉపగ్రహాలను రూపొందిస్తున్నట్లు ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. వీటితో పాటు సామాన్యుల దైనందిన జీవితానికి ఉపయోగపడే ఉపగ్రహాలు కూడా ఉన్నాయని అన్నారు. ఇవన్నీ వివిధ రకాల సాఫ్ట్ వేర్ల ద్వారా కంట్రోల్ అవుతాయని చెప్పారు. వీటన్నింటినీ రక్షించడానికి సైబర్ భద్రత చాలా ముఖ్యం అని స్పష్టం చేశారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఒక వరమని, అదే సమయంలో అది ముప్పు అని సోమనాథ్ అన్నారు. అయితే అదే టెక్నాలజీతో ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ను ఉపయోగించి సైబర్ నేరగాళ్లు విసురుతున్న సవాళ్లను ఎదుర్కోవచ్చని అన్నారు. ఆ దిశగా పరిశోధనలు, కృషి జరగాలన్నారు.

ప్రస్తుతం కాలంలో అధునాతన టెక్నాలజీ ఒక వరం. కానీ, అదే సమయంలో ముప్పుకూడా పొంచిఉందని ఇస్రో చైర్మన్ అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సైబర్ నేరగాళ్ల నుంచి ఎదురవుతున్న సవాళ్లను మనం అదే టెక్నాలజీతో ఎదుర్కోగలమని, ఆ దిశగా పరిశోధనలు, కృషి జరగాలని ఇస్రో చైర్మన్ సోమనాథ్ అభిప్రాయపడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story