ISRO: ఇక సూర్యుడిపై ఇస్రో దృష్టి

ISRO: ఇక సూర్యుడిపై ఇస్రో దృష్టి
శ్రీహరికోటకు చేరుకున్న ఉపగ్రహం... దేశీయంగానే శాటిలైట్‌ను తయారు చేసినట్లు ఇస్రో ప్రకటన

చంద్రయాన్ -3 మిషన్ విజయవంతం చేసిన ఇస్రో తదుపరి ప్రయోగానికి సిద్ధమవుతోంది. సూర్యుడి వాతావరణ పరిస్థితులపై పరిశోధన కోసం సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్ -1ను ప్రయోగించేందుకు సన్నాహాలు ముమ్మరం చేసింది. భూమి నుంచి 15లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాగ్రేంజ్ పాయింట్ ఎల్ -1 వద్ద ఈ వ్యోమనౌకను మోహరించనున్నారు. సూర్యుడిపై పరిశోధనలకు రోదసిలో తొలి భారతీయ అబ్జర్వేటరీగా ఈ వ్యోమనౌక పనిచేయనుంది. ఆదిత్య ఎల్ -1 మెుత్తం ఏడు పేలోడ్లను మోసుకెళ్లనుంది.

సూర్యుడి ఫోటోస్పియర్, క్రోమోస్పియర్ బయటి పొరలను, వివిధ వేవ్ బ్యాండ్ లలో పరిశీలించడానికి ఈ ఏడు పేలోడ్ లు ఉపయోగపడనున్నాయి. ఆదిత్య ఎల్ -1ను వివిధ జాతీయ సంస్థల భాగస్వామ్యంతో దేశీయంగానే తయారు చేసినట్లు ఇస్రోకు చెందిన ఓ అధికారి తెలిపారు. యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ నుంచి 2వారాలక్రితమే ఉపగ్రహం శ్రీహరికోటకు చేరుకుందని చెప్పారు. ఎల్ -1 పాయింట్ వద్ద ఉపగ్రహాన్ని మోహరించడం వల్ల గ్రహణం వంటి అవాంతరాలు లేకుండా సూర్యున్ని నిరంతరం వీక్షించే అవకాశం ఉంటుందని వెల్లడించారు.


సూర్యుడి వాతావరణ పరిస్థితులపై పరిశోధనల కోసం ఆదిత్య ఎల్‌-1ను ప్రయోగించనుంది. 378 కోట్ల రూపాయల వ్యయంతో సిద్ధమవుతున్న ఈ ప్రాజెక్టును సెప్టెంబరులో ప్రయోగించేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ సిద్ధమవుతోంది. సూర్యుడిపై పరిశోధనలకు రోదసిలో తొలి భారతీయ అబ్జర్వేటరీగా ఈ వ్యోమనౌక పనిచేయనుంది.

ఆదిత్య-ఎల్‌1ను సూర్యుడు-భూమి వ్యవస్థలోని లాగ్రేంజ్‌ పాయింట్‌ ఎల్‌1 వద్ద మోహరించనున్నారు. భూమిని నిరంతరం పరిశీలించేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ-నాసాతో కలిసి వచ్చే ఏడాది జనవరిలో నిసార్ అనే ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు ఇస్రో సన్నద్ధమవుతోంది. సముద్రమట్టాలు, భూగర్భ జలం, వాతావరణానికి సంబంధించిన అనేక కీలక వివరాలను ఈ ఉపగ్రహం ఎప్పటికప్పుడు అందజేయనుంది. సునామీలు, భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, కొండచరియలు విరిగిపడటం వంటి ప్రకృతి విపత్తులను సమర్థంగా ఎదుర్కొనేందుకు నిసార్‌ మిషన్‌ ఉపయోగపడనుంది.

Tags

Read MoreRead Less
Next Story