Chandrayaan-3: ల్యాండర్‌ కొత్త ఫొటోలు పోస్ట్ చేసిన ఇస్రో

Chandrayaan-3: ల్యాండర్‌ కొత్త ఫొటోలు పోస్ట్ చేసిన ఇస్రో
ఫోటో క్రెడిట్స్ చంద్రయాన్-2 ఆర్బిటర్ కి

జాబిల్లిపై చక్కగా నిద్రపోతున్న చంద్రయాన్-త్రీ విక్రమ్ ల్యాండర్‌ను నాలుగేళ్ల కిందట ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-2 ఆర్బిటర్ఫోటోలు తీసిందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో తెలిపింది. ఆర్బిటర్‌లోని డ్యుయల్-ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపర్చర్ రాడార్ పరికరం సెప్టెంబరు 6న ఈ ఫొటోలు తీసిందని వివరించింది. ఈ ఫొటోలను ఇస్రో ట్విటర్ ఖాతాతో పాటు వెబ్‌సైట్లో పోస్ట్ చేసింది. సౌర శక్తి వెలుగు లేకున్నా రాడార్ వల్ల ఫొటోలు తీయొచ్చని తెలిపింది. ఇప్పటికే జాబిల్లిపై ల్యాండర్, రోవర్ కు సంబంధించిన పలు ఫొటోలను ఇస్రో పోస్ట్ చేసింది. ఇటీవలే ఆదిత్య ఎల్‌-1 కూడా భూమితో పాటు జాబిల్లి ఫొటోలు తీసిన విషయం తెలిసిందే. సూర్యుడి రహస్యాలను ఛేదించేందుకు ఇస్రో ఇటీవలే ఆదిత్య ఎల్-1 ప్రయోగాన్ని చేసింది. మరోవైపు, విక్రమ్ ల్యాండర్ ను రోవర్ కూడా కొన్ని రోజుల ముందు ఫొటో తీసింది. రోవర్ లోని నావిగేషన్ కెమెరాలు ఈ ఫొటోలను తీశాయి.


సెప్టెంబరు 2019లో ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-2 చంద్రుడి దక్షిణ ధ్రువం ఉపరితలంపై ల్యాండింగ్ సమయంలో విఫలమైన విషయం తెలిసిందే. ల్యాండర్ విఫలమైనా.. ఆర్బిటర్ మాత్రం చంద్రుడి కక్ష్య చుట్టూ తిరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 23న చంద్రుడి ఉపరితలంపై ల్యాండింగ్ సమయంలో విక్రమ్‌తో ఈ ఆర్బిటర్‌ను విజయవంతంగా ఇస్రో అనుసంధానించింది.

ల్యాండర్ ఫోటోలు తీసిన పరికరం గురించి ఇస్రో మరింత వివరిస్తూ.. ‘SAR పరికరం ఇచ్చిన ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌లో మైక్రోవేవ్‌లను ప్రసారం చేస్తుంది.. ఉపరితలం నుంచి ప్రతిబింబాన్ని అదే స్వీకరిస్తుంది. ఇది రాడార్ అయినందున సూర్యకాంతి అవసరం లేకుండా ఫోటోలు తీయగలదు.. ఇది లక్ష్యానికి సంబంధించిన దూరం, భౌతిక లక్షణాలు రెండింటినీ అందించగలదు.. అందువల్ల, భూమి, ఇతర ఖగోళ వస్తువుల రిమోట్ సెన్సింగ్ కోసం SAR ఉపయోగిస్తారు’ అని తెలిపింది.


చంద్రుడిపై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో చేపట్టిన పరిశోధనలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. చంద్రయాన్ 3లో భాగంగా ఇస్రో పంపించిన విక్రమ్ ల్యాండర్.. నిద్రలోకి జారుకుంది. చంద్రుడిపై రాత్రి సమయం ఆరంభం కావడం దీనికి కారణం. బ్యాటరీ ఛార్జింగ్ ఉన్నంత సేపూ నిరంతరాయంగా కార్యకలాపాలను కొనసాగించిన ప్రజ్ఞాన్ రోవర్ కూడా స్లీప్ మోడ్‌లోకి వెళ్లింది. విక్రమ్ ల్యాండర్‌ పేలోడ్స్- చంద్రాస్ సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్‌పెరిమెంట్ (ఛాస్టే), రేడియో అనాటమీ ఆఫ్ మూన్ బౌండ్ హైపర్‌సెన్సిటివ్ అయానోస్ఫియర్ అండ్ అట్మాస్ఫియర్- లాంగ్ముయిర్ ప్రోబ్ (రంభా ఎల్పీ),ఇన్‌స్ట్రుమెంట్ ఫర్ లూనార్ సెస్మిక్ యాక్టివిటీ (ఐఎల్ఎస్ఏ).. వంటి ఇన్-సిటు కూడా టర్న్ ఆఫ్ అయ్యాయి.

Tags

Next Story