చంద్రయాన్ 3 ఫోటోలు విడుదల చేసిన ఇస్రో

జులై 12-19 ల మధ్య ప్రయోగం

మన ఇస్రో శాస్త్రవేత్తలు ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ప్రయోగం చంద్రయాన్ 3. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అంటే GSLV- Mk III నుండి చంద్రయాన్-3 మిషన్‌ను ప్రయోగించనుంది. భూమిపై కాకుండా వేరే ప్రదేశంలో తన వాహనాన్ని సాఫ్ట్ ల్యాండింగ్ చేసే సామర్థ్యాన్ని పొందడమే ఈ మిషన్ ఉద్దేశం. జూలై 12 నుంచి జూలై 19 లోపు దీనిని లాంచ్ చెయడానికి రంగం సిద్ధమవుతోంది.

ప్రస్తుతం వెహికల్ ఫోటోలను విడుదల చేసింది ఇస్రో. లాంచ్ వెహికల్‌తో మిషన్‌ను అనుకున్న సమయంలో ప్రయోగించేందుకు అంతరిక్ష పరిశోదన సంస్థ తీవ్రంగా పని చేస్తోంది. భారతదేశపు అత్యంత బరువైన రాకెట్ చంద్రయాన్-3. ఇస్రో చేత తయారు చేయబడిన మూడు దశల ప్రయోగ వాహనం. చంద్రయాన్-3లో స్వదేశీ ల్యాండర్ మాడ్యూల్ , ప్రొపల్షన్ మాడ్యూల్ తో పాటుగా రోవర్ ఉన్నాయి. ఇది గ్రహాంతర మిషన్‌లకు అవసరమైన కొత్త సాంకేతికతలను అభివృద్ధి చేయడంతో పాటు ప్రదర్శించడం లక్ష్యంగా పెట్టుకుంది. ల్యాండర్ మాడ్యూల్‌కు నిర్ణీత ప్రదేశంలో సాఫ్ట్ ల్యాండింగ్ మరియు రోవర్‌ను మోహరించే సామర్థ్యం ఉంటుందని, ఇది దాని కదలిక సమయంలో చంద్రుని ఉపరితలం యొక్క ఇన్-సిటు రసాయన విశ్లేషణను నిర్వహిస్తుందని ఇస్రో తెలిపింది.

చంద్రుని మీద ప్రయోగానికి సన్నద్ధం కావడానికి చేసే హాట్ టెస్ట్ మరియు కోల్డ్ టెస్టులు ఇప్పటికే పూర్తి అయినట్టుగా సమాచారం. ప్రయోగ సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు చంద్రయాన్-3లో హార్డ్‌వేర్, స్ట్రక్చర్, కంప్యూటర్లు, సాఫ్ట్‌వేర్, సెన్సార్లలో మార్పులు చేశారు. ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి కోసం పెద్ద సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేశారు. మరో అదనపు సెన్సార్ ను కూడా జోడించారు. దీని వేగాన్ని కొలవడానికి గత ఏడాది అభివృద్ధి చేసిన 'లేజర్ డాప్లర్ వెలోసిమీటర్' పరికరాన్ని అమ‌ర్చారు. చంద్రయాన్ 3 ద్వారా చంద్రుని ఉపరితలంపై ప్లాస్మా,పర్యావరణం, ధర్మో ఫిజికల్ లక్షణాలు, భూకంప అవకాశాలను అధ్యయనం చేసేందుకు అవసరమైన సైంటిఫిక్ పరికరాల్ని పంపనున్నారు.

2019లో జరిగిన చంద్రయాన్ 2 యాత్ర చివరి దశలో విఫలమైంది. విజయవంతంగా చంద్రుని కక్ష్యలో ప్రవేశపెట్టినా..సాఫ్ట్‌వేర్ లోపం తలెత్తడంతో 2019 సెప్టెంబర్ 6వ తేదీన చంద్రునిపై ల్యాండ్ అయ్యే క్రమంలో కక్ష్య నుంచి వైదొలగి ల్యాండర్ కాస్తా ఉపరితలంపై క్రాష్ ల్యాండ్ అయింది. చంద్రయాన్ 3 ప్రయోగం పూర్తిగా విజయవంతమయ్యేందుకు ఇస్రో అన్ని ప్రయత్నాలు చేస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story