Aditya-L1 : ఇంక సూర్యుడే టార్గెట్

అంతరిక్ష పరిశోధనలలో ఇస్రో మరో ముందడుగుకు సిద్ధమయ్యింది. చంద్రయాన్-3ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తరువాత ఉరిమే ఉత్సాహంతో ఇప్పుడు సూర్యుడి వైపు పరుగులు పెడుతోంది.సూర్యుడి గురించి తెలుసుకొనే మిషన్ ఆదిత్య-ఎల్1 ప్రయోగానికి చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. సౌర వాతావరణాన్ని లోతుగా పరిశోధించడమే దీని లక్ష్యం. సెప్టెంబర్ మొదటి వారంలో PSLV-C57 రాకెట్ ద్వారా ఆదిత్య-L1 ఉపగ్రహం నింగిలోకి బయలుదేరానుంది.

ఆదిత్య - ఎల్1 ప్రయోగాన్ని బెంగళూరులోని యూఆర్‌రావు శాటిలైట్ సెంటర్‌లో తయారు చేయగా అక్కడి నుంచి సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌కుభారీ భద్రత మధ్య తరలించారు.1500 కిలోల బరువున్న ఈ శాటిలైట్ ను భూమి నుంచి సూర్యుని దిశగా 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలోని లాగ్రాంజ్ పాయింట్ 1, L వన్ చుట్టూ ఉన్న కక్ష్యలో దీన్ని ప్రవేశపెట్టనున్నారు. ఈ కక్ష్యలోకి పంపించడం ద్వారా గ్రహణాలతో సంబంధం లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసేందుకు అవకాశం దొరుకుతుంది. ఈ ప్రయోగంలో భాగంగా సౌర కార్యకలాపాలు, అంతరిక్ష వాతావరణంలో దాని ప్రభావంపై అధ్యయనం చేయనున్నారు. సౌర తుపాన్ల సమయంలో జరిగే మార్పులపై స్టడీ చేయనున్నారు.

ఆదిత్య-ఎల్ 1 మొత్తం ఏడు పేలోడ్లను మోసుకెళ్లనుంది. ఇందులో ప్రధానమైన విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనాగ్రాఫ్ తో పాటు సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్, ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్‌పెరిమెంట్, ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య, సోలార్ లో ఎనర్జీ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్, హైఎనర్జీ ఎల్-1 ఆర్బిటింగ్ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్, మ్యాగ్నెటోమీటర్ పేలోడ్‌లను అమర్చనున్నారు.సూర్యగోళం నుంచి ప్రసరించే అత్యంత శక్తిమంతమైన కాంతి ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు అనువుగా ఈ పేలోడ్‌లను రూపొందించారు. ఈ పేలోడ్లు సూర్యుడి వెలుపలి పొరలు, సౌరశక్తి కణాలు, సూర్యుడి అయస్కాంత క్షేత్రాన్ని పరిశీలించనున్నాయి. ఆదిత్య-ఎల్1లోని నాలుగు పేలోడ్‌లు నేరుగా సూర్యుడిని వీక్షిస్తాయి. మిగిలిన మూడు పేలోడ్‌లు ఎల్1 వద్ద కణాలు, క్షేత్రాల అధ్యయనాలు నిర్వహిస్తాయి
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com