ISRO: నేడే నింగిలోకి పీఎస్ఎల్వీ-సీ62

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 2026 సంవత్సరంలో తన తొలి ప్రయోగానికి సిద్ధమైంది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) రూపొందించిన 'అన్వేష' భూపరిశీలన ఉపగ్రహాన్ని పీఎస్ఎల్వీ-సీ62 రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి జనవరి 12వ తేదీ ఉదయం 10:17 గంటలకు ఈ ప్రయోగం జరగనుంది. ఇందుకు సంబంధించిన 22.5 గంటల కౌంట్‌డౌన్ ఆదివారం మధ్యాహ్నం 12:17 గంటలకు మొదలైంది.
'అన్వేష' ఉపగ్రహం దేశ రక్షణ, వాతావరణ అధ్యయన రంగాల్లో అత్యంత కీలకం కానుంది. హైపర్‌స్పెక్ట్రల్ ఇమేజింగ్ టెక్నాలజీతో పనిచేసే ఈ ఉపగ్రహం భూమి ఉపరితలాన్ని అత్యంత సూక్ష్మంగా పరిశీలించగలదు. దీని ద్వారా సరిహద్దుల వద్ద పర్యవేక్షణ, వ్యూహాత్మక నిఘా కార్యకలాపాలకు కీలక సమాచారం అందుతుంది. అంతేకాకుండా, వాతావరణ మార్పులను అధ్యయనం చేయడం, తుఫానులు, వరదలు వంటి ప్రకృతి విపత్తులను ముందుగానే పసిగట్టి హెచ్చరికలు జారీ చేయడంలో ఇది సహాయపడనుంది.
ఈ మిషన్‌లో 'అన్వేష' ప్రధాన ఉపగ్రహం కాగా, దీనితో పాటు మరో 15 చిన్న ఉపగ్రహాలను కూడా ఒకేసారి నింగిలోకి పంపుతున్నారు. వీటిలో 7 దేశీయ, 8 విదేశీ ఉపగ్రహాలు ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ 'టేక్‌మీ2స్పేస్' రూపొందించిన ఉపగ్రహం కూడా వీటిలో ఉండటం విశేషం.
పీఎస్ఎల్వీ రాకెట్‌కు ఇది 64వ మిషన్. షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈ ప్రయోగం జరగనుండగా, ఇస్రో శాస్త్రవేత్తలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భారత అంతరిక్ష ప్రయోగాల్లో మరో మైలురాయిగా నిలవనున్న ఈ ప్రయోగంపై దేశవ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ప్రత్యేకతలు ఇవీ
ఈ ప్రయోగంలో 1485 కిలోల బరువు కలిగిన ఈవోఎస్–ఎన్1 ఉపగ్రహాన్ని భూమికి 600 కిలో మీటర్ల ఎత్తులోని సన్ సింక్రనస్ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టనున్నారు. మరో 10 సెకెండ్ల తర్వాత 14 స్వదేశీ, విదేశీ ఉపగ్రహాలను కూడా 600 కిలోమీటర్ల ఎత్తులోనే ప్రవేశపెడతారు.
⇒ అనంతరం పీఎస్–4 దశను రీస్టార్ట్ చేసి స్పెయిన్‌దేశానికి చెందిన కిడ్ అనే పేలోడ్‌ను ప్రవేశపెట్టి ఈ రెండో దశలో పసిఫిక్ మహాసముద్రంలోకి పడేలా డిజైన్ చేశారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

