Chandrayaan 3: చంద్రయాన్​-3లో తమిళనాడుకు చెందిన మట్టి ప్రముఖ పాత్ర

Chandrayaan 3: చంద్రయాన్​-3లో తమిళనాడుకు చెందిన మట్టి ప్రముఖ పాత్ర
చంద్రయాన్​-3లో తమిళనాడుకు చెందిన మట్టి ప్రముఖ పాత్ర

ప్రతిష్టాత్మక చంద్రయాన్​-3లో తమిళనాడుకు చెందిన మట్టి ప్రముఖ పాత్ర పోషించింది. చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్​ను సురక్షితంగా సాఫ్ట్​ ల్యాండింగ్​ చేయడం, రోవర్.. ప్రోగ్రామ్​ చేసిన విధంగా పరిశోధనలు చేపట్టడానికి వాటిని పరీక్షించాల్సి ఉంటుంది. అందుకోసం చంద్రుడిపై ఉన్న వాతావరణాన్ని భూమిపై కృత్రిమంగా తయారు చేయాల్సి ఉంటుంది. దీనికి సుమారు 60-70 టన్నుల చంద్రునిపై ఉండే మట్టి అవసరమవుతుంది. గతంలో ఈ లక్షణాలు గల మట్టిని​ అమెరికా నుంచి కిలోకు 150 డాలర్లు వెచ్చించి ఇస్రో కొనుగోలు చేసింది. అయితే, భవిష్యత్తులో భారత్​ తలపెట్టనున్న అనేక అంతరిక్ష ప్రయోగాలకు కూడా భారీ పరిమాణంలో మట్టి అవసరమవుతుంది. ఇక అమెరికా నుంచి తీసుకోవడం ఖరీదైన వ్యవహారం.



ఇది తలకుమించిన భారం అనిపించడంతో అలాంటి మట్టి మన దేశంలోనూ లభిస్తుందేమోనని ఇస్రో శాస్త్రవేత్తలు అన్వేషణ చేపట్టారు. అలాంటి లక్షణాలున్న మట్టి తమిళనాడులోని నామక్కల్‌ జిల్లా కున్నమలై, సిద్ధంపూడి గ్రామాల్లో ఉన్నట్టు చివరికి గుర్తించారు. సేలం పెరియార్‌ విశ్వవిద్యాలయ భౌగోళిక శాస్త్ర అధ్యాపకుల సహకారంతో సిద్ధంపూడి, కున్నమలై ప్రాంతాల్లోని మట్టి సేకరించి పరిశోధించారు. ఆ మట్టి చంద్రుడిపై ఉన్న మట్టి అనార్థోసైట్‌ రాక్‌లా ఉన్నట్టు తేలడంతో దానిని 50 టన్నుల మేరకు ఇస్రోకు తరలించారు. ఆ మట్టి నమూనాలతో ప్రత్యేక ల్యాబొరేటరీ రూపొందించి, చంద్రయాన్‌-3లోని ల్యాండర్‌, రోవర్‌ చంద్రుని ఉపరితలంపై సురక్షితంగా దిగేలా, అక్కడ అడుగులు వేసేలా ఇస్రో శాస్త్రవేత్తలు పరీక్షలు నిర్వహించారు. సాధారణంగా నేల లేత ఎరుపు, క్రిమన్స్‌ రంగులో ఉంటుంది. దీనికి భిన్నంగా సిద్ధంపూడి, కున్నమలై ప్రాంతాల్లోని నేల తెల్లగా ఉంది. అందువల్లే ఈ మట్టిపై చంద్రయాన్‌-2, 3 పరిశోధనలు చేపట్టారు. దీనిపై నామక్కల్‌ జిల్లా ప్రజలు.. చంద్రయాన్‌-3 చంద్రునిపై కన్నా ముందు తమ జిల్లా మట్టిపై తొలి అడుగులు వేసిందని గర్వంగా చెప్పుకొంటున్నారు.



తమిళనాడు రాజధాని చెన్నైకి 400 కిలో మీటర్ల దూరంలోని నమక్కల్ ప్రాంతంలో ఉన్న మట్టి.. చంద్రయాన్​మిషన్​టెస్టింగ్‌కు​కోసం 2012 నుంచి సరఫరా అవుతోంది. ఈ మట్టి చంద్రయాన్​ల్యాండర్, రోవర్​ల సామర్థ్యాలను పరీక్షీంచడానికి, మెరుగుపరచడానికి ఇస్రోకు వీలు కలిగింది. ఇలాంటి మట్టి తమిళనాడులోని నమక్కల్​ ప్రాంతంలో సమృద్ధిగా లభ్యమైందని.. అందుకే ఇస్రోకు అవసరం అయినప్పుడల్లా సరఫరా చేశామని పెరియార్​ విశ్వవిద్యాలయంలోని జియాలజీ విభాగం డైరెక్టర్ ఎస్​అన్బళగన్ తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story