Arvind Kejriwal: గుజరాత్‌లో స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో కేజ్రీవాల్, భార్య సునీతా కేజ్రీవాల్

గుజరాత్‌లో లోక్‌సభ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్లజాబితాను ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) విడుదల చేసింది. లిక్కర్ పాలసీ కేసులో అరెస్టై జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, సీనియర్ ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్‌తోపాటు కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భవంత్ మాన్ సింగ్ ఈ జాబితాలో ఉన్నారు. గుజరాత్‌లో లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం 40 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ఎన్నికల కమిషన్ (ఈసీ)కు ఆప్ సమర్పించింది. ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు సంజయ్ సింగ్, రాఘవ్ చద్దా, సందీప్ పాఠక్ పేర్లు కూడా ఉన్నాయి. అయితే రాజ్యసభ సభ్యులైన హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్ పేర్లు జాబితాలో మిస్ అయ్యాయి.
ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌ను ఈడీ గత నెల 21న అరెస్ట్ చేసింది. ఆయన ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైల్లో ఉన్నారు. అక్కడినుంచే పాలనకు సంబంధించి ఆదేశాలు ఇస్తున్నారు. లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తన అధికారిక నివాసం నుంచి గత నెలలో అరెస్టు చేసిన వెంటనే సునీతా కేజ్రీవాల్ పార్టీలో ప్రాధాన్యతను పెంచుకున్నారు. సునీతా కేజ్రీవాల్ అప్పటి నుంచి ఆప్ నాయకులు, ప్రతిపక్షం నేతృత్వంలోని ఇండియా బ్లాక్ సభ్యులతో అనేక సమావేశాలు నిర్వహించారు. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పటి నుంచి ఆమె అరవింద్ కేజ్రీవాల్ తరఫున వీడియో సందేశాలు కూడా విడుదల చేశారు.
గుజరాత్‌లోని 26 లోక్ సభ స్థానాలు ఉండగా మిత్రపక్షం కాంగ్రెస్ 24 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ భరూచ్, భావ్‌నగర్ నియోజకవర్గాల్లో బరిలో నిలిచింది. బరూచ్ నుంచి చైతర్ వాసవ, భావ్‌నగర్ నుంచి ఉమేష్ మక్వానాను ఆమ్ ఆద్మీ పార్టీ బరిలోకి దింపింది. గుజరాత్‌లో లోక్ సభ ఎన్నికలు మే 7న ఒకే దశలో జరగనున్నాయి. నామినేషన్ పత్రాల స్వీకరణకు చివరి తేదీ ఏప్రిల్ 19.
-
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com