Jaishankar: ఎస్‌సీఓ సదస్సులో సరిహద్దు తీవ్రవాదంపై పాక్‌కు జైశంకర్ చురకలు

చెట్టు నాటిన విదేశాంగ మంత్రి

సరిహద్దుల వెంబడి ఉగ్రవాదం, తీవ్రవాదం ఉంటే దేశాల మధ్య సహకారం వృద్ధి చెందే అవకాశం ఉండదని భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ (Jaishankar) పరోక్షంగా పొరుగుదేశమైన పాకిస్థాన్‌కు చురకలు అంటించారు.

దాదాపు 9 ఏళ్ల తర్వాత భారత విదేశాంగ మంత్రి పాకిస్తాన్‌లో పర్యటిస్తున్నారు. షాంఘై కో ఆపరేషన్ సమ్మిట్ కోసం పాకిస్తాన్ వెళ్లిన జైశంకర్.. అక్కడ వాకింగ్ చేశారు. అనంతరం.. ఒక మొక్కను కూడా నాటారు. వీటికి సంబంధించిన ఫోటోలను కూడా ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. మరోవైపు.. ఎస్‌సీఓ సదస్సులో పాల్గొని ప్రసంగించిన జైశంకర్.. పాక్ గడ్డపై ఉండి ఆ దేశానికి చురకలు అంటించారు. ఇక పాక్‌లో అడుగుపెట్టిన జైశంకర్‌కు ఆ దేశ ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. ఇక జైశంకర్‌తోపాటు.. ఎస్‌సీఓ సదస్సులో పాల్గొనేందుకు ఆ దేశానికి వెళ్లిన ఎస్‌సీఓ సభ్య దేశాల ప్రతినిధులకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్.. తన నివాసంలో విందు కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా జైశంకర్, షెహబాజ్ షరీఫ్.. షేక్ హ్యాండ్ ఇచ్చుకుని కాసేపు మాట్లాడుకున్నారు.

ఇస్లామాబాద్‌లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ -ఎస్‌సీవో సదస్సులో పాల్గొనేందుకు జైశంకర్ పాకిస్తాన్‌ వెళ్లిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం పాక్‌లోని భారత హైకమిషన్‌లో ఉన్న సిబ్బందితో కలిసి జైశంకర్ కొద్దిసేపు నడిచారు. అనంతరం అక్కడే ఓ చెట్టును నాటారు. పాక్‌లో టీమ్‌ ఇండియా సిబ్బందితో మార్నింగ్ వాక్ అంటూ ఆయన కొన్ని ఫోటోలను షేర్ చేశారు. ఆ తర్వాత ఎస్‌సీఓ సదస్సు వేదిక వద్దకు చేరుకున్న జైశంకర్‌ను పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్ లోపలికి తీసుకెళ్లారు.

ఇక షాంఘై కోఆపరేషన్ సమ్మిట్‌లో ప్రసంగించిన జైశంకర్‌.. షెహబాజ్‌ షరీఫ్ ప్రభుత్వానికి కౌంటర్ వేశారు. భారత్, పాక్ మధ్య సంబంధాలు ఎందుకు దెబ్బతిన్నాయో పాక్ ప్రభుత్వం ఆత్మపరిశీలన చేసుకోవాలని.. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రస్తావించారు. నమ్మకం, స్నేహం, సహకారం లేకుంటే దగ్గరివారు కూడా దూరం అవుతారని పేర్కొన్నారు. పొరుగు దేశాల సరిహద్దుల్లో తీవ్రవాదం, ఉగ్రవాదం, వేర్పాటువాదం ఉంటే.. ఆ రెండు దేశాల మధ్య వాణిజ్యం, అనుసంధానం, ప్రజల మధ్య సంబంధాలు లేకుండా పోతాయని తెలిపారు.

అయితే ఎక్కడా కూడా జైశంకర్ పాకిస్తాన్‌ పేరు పలకకపోవడం గమనార్హం. ఇక ఎస్‌సీఓ సమావేశం తర్వాత ట్వీ్ట్ చేసిన జైశంకర్.. ఇస్లామాబాద్‌లో జరిగిన ఎస్‌సీఓ సదస్సులో భారతదేశ ప్రకటనను వినిపించానని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న కల్లోల ప్రపంచంలో భారత్ ఎదుర్కొంటున్న సవాళ్లకు తగిన విధంగా ఎస్‌సీఓ స్పందించాలి అంటూ తెలిపారు. 2015 డిసెంబరులో అప్పటి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ పాక్‌లో పర్యటించగా.. 9 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు జైశంకర్ అక్కడ అడుగు పెట్టారు.

Tags

Next Story