Jamili Elections: జమిలిపై మూడు బిల్లులు

జమిలి ఎన్నికల కోసం కేంద్ర ప్రభుత్వం రెండు రాజ్యాంగ సవరణ బిల్లులు, ఒక సాధారణ బిల్లును తీసుకురానుంది. ప్రతిపాదిత మొదటి రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభ, శాసనసభ ఎన్నికలను ఒకేసారి నిర్వహించడానికి సంబంధించింది. ఇందుకోసం 82ఎ, 83(2) అధికరణలకు సవరణలు చేయాల్సి ఉంటుంది.
327 అధికరణకు సవరణ చేసి ‘ఏక కాల ఎన్నికలు’ అనే పదాన్ని పొందుపరచాల్సి ఉంటుంది. రాష్ర్టాల వ్యవహారాలకు సంబంధించిన ప్రతిపాదిత రెండో రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలతో పాటు పురపాలికలు, పంచాయతీలకు ఎన్నికల నిర్వహణకు అవసరమైన నిబంధనలకు సంబంధించినది. మూడో బిల్లు శాసనసభలు కలిగిన కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇతర రాష్ర్టాల అసెంబ్లీలు, లోక్‌సభకు పేర్కొన్న విధంగానే నిబంధనలను సరి చేయడానికి సంబంధించినది.
దేశంలో ఏకకాల ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమం చేసేలా మూడు బిల్లులను తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. వీటిలో రాజ్యాంగ సవరణకు ఉద్దేశించినవి రెండు ఉంటాయి. లోక్‌సభ-శాసనసభ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి కనీసం సగం రాష్ట్రాల నుంచి ఆమోదం అవసరమవుతుంది. ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’ ప్రణాళిక కింద ఉన్నతస్థాయి కమిటీ సిఫార్సుల్ని ప్రభుత్వం ఇటీవలే ఆమోదించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్త ఏకాభిప్రాయ సేకరణ తర్వాత దశలవారీగా దీనిని అమలు చేయనున్నారు. లోక్‌సభ, శాసనసభ ఎన్నికలను కలిపి నిర్వహించడానికి రాజ్యాంగంలోని 82-ఏ అధికరణంలో మార్పు చేసేలా మొదటి బిల్లును ప్రతిపాదిస్తున్నారు. లోక్‌సభ పదవీకాలం, దాని రద్దుపై 83(2)లో కొత్తగా అనుబంధ నిబంధనలు చేర్చనున్నారు. అసెంబ్లీల రద్దుకు రాజ్యాంగంలోని 327 అధికరణాన్ని సవరించి ‘ఏకకాల ఎన్నికలు’ అనే పదాలను చేర్చనున్నారు. ఈ బిల్లుకు 50% రాష్ట్రాల ఆమోదం అవసరం లేదు. ఓటర్ల జాబితా తయారీకి సంబంధించిన రెండో సవరణకు మాత్రం రాష్ట్రాల శాసనసభల ఆమోదం ఉండాలి. రాజ్యాంగం ప్రకారం కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలు వేర్వేరు సంస్థలు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, లోక్‌సభ, రాజ్యసభ, రాష్ట్ర శాసనసభలు, శాసనమండళ్ల ఎన్నికలను ఈసీ నిర్వహిస్తుంది. పురపాలక సంఘాలు, పంచాయతీలకు రాష్ట్ర సంఘం ఎన్నికలు నిర్వహిస్తుంది. లోక్‌సభ-శాసనసభ ఎన్నికలతో పాటు పురపాలక సంఘాలు, పంచాయతీలకూ ఎన్నికలు నిర్వహించేలా 324-ఏ అధికరణాన్ని సవరించడం రెండో బిల్లు ఉద్దేశం. శాసనసభలున్న మూడు కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి మూడో బిల్లు ప్రవేశపెడతారు. దీనికి కూడా రాష్ట్రాల సమ్మతి అవసరం లేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com