Rainfall: జమ్మూలో కుండపోత వర్షం.. రాజస్థాన్‌లో కూడా

స్తంభించిన జనజీవనం..

జమ్మూను భారీ వర్షాలు ముంచెత్తాయి. రెండు రోజుల నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో జమ్మూ అతలాకుతలం అయింది. భారీ వర్షం కారణంగా కథువా, సాంబా, రియాసి, ఉధంపూర్‌ సహా పలు ప్రాంతాల్లో వరద ముంచెత్తింది. శనివారం నుంచి ఆదివారం వరకు ఏకధాటిగా వర్షం కురవడంతో 100 సంవత్సరాల్లో ఆగస్టులో రెండో అత్యధిక వర్షపాతం ఇదేనని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జమ్మూ నగరంలో 190.4 మి.మీ వర్షపాతం నమోదైనట్లుగా పేర్కొన్నారు. ఆగస్టు 5న 1926న జమ్మూలో 228.6 మి.మీ వర్షపాతం నమోదైంది. ఆ రికార్డ్‌ను గతంలో ఆగస్టు 11, 2022న బద్దలు కొట్టింది. అప్పుడు 189.6 మి.మీ వర్షపాతం నమోదైంది. మళ్లీ ఇప్పుడు ఇదే ఆగస్టులో 190.4 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇక భారీ వర్షాలు కారణంగా జనజీవనం అస్తవ్యస్తం అయింది. ఇళ్లల్లోకి నీరు రావడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అలాగే ప్రజా రవాణా పూర్తిగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో అధికారులు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.

ఇక ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్ని విభాగాల అధికారులు అప్రమత్తం కావాలని ఆదేశించారు. కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని.. బాధితులకు సహాయ సహకారాలు అందించాలని సూచించారు. ఇక జమ్మూలో చిక్కుకున్న 45 మంది విద్యార్థులను దళాలు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక పలు ప్రాంతాల్లో కొండచరియలువిరిగిపడడంతో రహదారులు మూసివేశారు. ఇక విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పలు ప్రాంతాల్లో అంధకారం అలుముకుంది.

రాజస్థాన్‌లో..

రాజస్థాన్‌లో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. కుండపోత వానలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో సువాయ్‌ మాధోపూర్‌ జిల్లాలోని జడవాటా గ్రామం వద్ద సుర్వాల్‌ డ్యామ్‌ పొంగిపోయింది. ఒక్కసారిగా వరద పోటెత్తడంతో గ్రామంలో 2 కిలోమీటర్ల మేర జలపాతం మాదిరిగా పెద్ద గుంత ఏర్పడింది. 2 కిలోమీటర్ల పొడవున్న గుంత 100 అడుగుల వెడల్పు, 55 అడుగుల లోతు ఉన్నది. వరద ఉధృతికి రెండు ఇండ్లు, రెండు షాపులు, రెండు దేవాలయాలు ధ్వంసమయ్యాయి. కాగా, వర్షాలు ఇలాగే కొనసాగితే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని నిపుణులు హెచ్చరించారు.

గ్రామానికి చేరుకున్న ఆర్మీ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. సమీపంలోని ఇండ్లను ఖాళీ చేయించారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కరోడి లాల్‌ మీనా గుంతపై ఆరా తీశారు. ప్రభావిత ప్రాంతాన్ని పరిశీలించారు. యంత్రాల సహాయంతో నీటి ప్రవాహాన్ని మళ్లించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అయితే ప్రస్తుత పరిస్థితిల్లో భూమి కోతను ఆపడం కష్టమని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు.

Tags

Next Story