Prashant Kishore: బీజేపీ బెదిరింపుల వల్లే తప్పుకున్నాం: పీకే సంచలన వ్యాఖ్యలు

Prashant Kishore:  బీజేపీ బెదిరింపుల వల్లే తప్పుకున్నాం: పీకే సంచలన వ్యాఖ్యలు
X
ముగ్గురు అభ్యర్థులు నామినేషన్ల విత్‌డ్రా

బీహార్‌లో ఎన్నికల సమరం రసవత్తరంగా సాగుతోంది. అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అయితే జన్ సురాజ్ పార్టీకి చెందిన ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో బీజేపీపై జన్ సురాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ ధ్వజమెత్తారు. బీజేపీ ఒత్తిడి కారణంగానే తమ పార్టీకి చెందిన ముగ్గురు అభ్యర్థులు ఎన్నికల బరి నుంచి వైదొలిగారని ఆరోపించారు. తమ పార్టీకి చెందిన అభ్యర్థులను బెదిరించి నామినేషన్ల ఉపసంహరించుకునేలా చేశారని తెలిపారు. బీజేపీకి పోరాడటానికి ధైర్యం లేకపోవడంతో ఇలాంటి ఒత్తిడి వ్యూహాలకు పాల్పడుతుందని మండిపడ్డారు.

జన్ సురాజ్ పార్టీకి చెందిన దానాపూర్, బ్రహంపూర్, గోపాల్‌గంజ్ స్థానాలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. గోపాల్‌గంజ్ అభ్యర్థి శశి శేఖర్ సిన్హా అకస్మాత్తుగా మొబైల్ ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసి తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారని ప్రశాంత్ కిషోర్ ఆరోపించారు. జన్ సురాజ్‌కు చెందిన ఇతర అభ్యర్థులు కూడా ఇలాంటి ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని… బీహార్‌లో ఓటమి భయంతో బీజేపీ ఎలా కుయుక్తులకు పాల్పడుతుందని వ్యాఖ్యానించారు.

బీహార్‌లో ఎన్డీఏ కూటమి మినహా మిగతా అన్ని పార్టీలు విడివిడిగా పోటీ చేస్తున్నాయి. నిన్నామొన్నిటి దాకా కలిసి తిరిగిన ఇండియా కూటమి పార్టీలు.. చివరి నిమిషంలో ఎవరిదారి వారే చూసుకున్నారు. విభేదాలు కారణంగా వేర్వేరుగా పోటీ చేస్తున్నారు. విపక్ష కూటమి బలహీనతను ఎన్డీఏ కూటమి క్యాష్ చేసుకుంటోంది.

బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 14న విడుదల కానున్నాయి. ఇక ప్రధాని మోడీ అక్టోబర్ 24న ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. రాష్ట్రంలో పలుచోట్ల ఎన్నికల ర్యాలీలు నిర్వహించనున్నారు.

ఇక తాజాగా కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో.. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, వివిధ రాష్ట్రాల అధ్యక్షులు ఉన్నారు. అలాగే రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు నాయకులు ఈ జాబితాలో ఉన్నారు. అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్‌లను స్టార్ క్యాంపెయినర్లుగా నియమించారు.

Tags

Next Story