Robbery Jewellry Shop: ముంబైలో ముసుగులు ధరించి నగల షాపులో చోరీ
మహారాష్ట్రలోని నవీ ముంబైలో ఆదివారం రాత్రి అచ్చం సినిమా తరహాలో దోపిడీ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు హెల్మెట్ ధరించి దుకాణంలోకి ప్రవేశించి కాల్పులు జరిపి ఏకంగా రూ. 11 లక్షల విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో ముంబైలోని ఖర్ఘర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. నిందితులు నల్లటి దుస్తులు ధరించి, ముఖానికి హెల్మెట్ ధరించి ఉన్నారని పోలీసులు తెలిపారు. దోపిడీ సమయంలో షాపులోని ఉద్యోగులను బెదిరించి రూ. 11.80 లక్షల విలువైన నగలను దోచుకెళ్లారు.
దుండగులు కేవలం 3 నిమిషాల్లోనే మొత్తం ఘటనకు పాల్పడ్డారని ఖర్ఘర్ పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు. ఈ దోపిడీ సమయంలో దొంగలు 5 నుండి 6 బుల్లెట్లను కాల్చినట్లు తెలుస్తోంది. ఈ కాల్పుల్లో ఎవరికీ గాయాలు అయినట్లు సమాచారం లేదని పోలీసులు తెలిపారు. ముగ్గురు దుండగులు ఒకే బైక్ లో పరారయ్యారు. కొందరు వారిని వెంబడించేందుకు కూడా ప్రయత్నించారు. కానీ వారు కాల్పులు జరపడంతో కాస్త భయబ్రాంతులకు లోనయ్యారు. నిందితుడు దోపిడీకి పాల్పడుతున్న సీసీటీవీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com