CM Omar Abdullah: ప్రధాని మోడీతో జమ్మూకాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా భేటీ

జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) గురువారం ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. జమ్మూకాశ్మీర్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ఆయన ఢిల్లీలో పర్యటించారు. జమ్మూకాశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కేంద్రాన్ని కోరుతూ ఇటీవల ఒమర్ అబ్దుల్లా మంత్రివర్గం తీర్మానం చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆ తీర్మానానికి జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆమోదం కూడా తెలిపారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం ఒమర్ అబ్దుల్లా భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. జమ్మూకాశ్మీర్‌కు రాష్ట్ర హోదా తీర్మానాన్ని ప్రధానికి అందించినట్లు సమాచారం.
కాగా, ప్రధాని నరేంద్ర మోడీని కలవడానికి ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఒమర్ అబ్దుల్లా భేటీ అయ్యారు. జమ్మూకాశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా పునరుద్ధరణ అంశంపై వీరిద్దరూ చర్చించినట్లు సమాచారం. ఈ పునరుద్ధరణ ప్రక్రియను ప్రారంభించే యోచనలో కేంద్రం ఉందని, ఈ మేరకు హామీ లభించిందని వార్తలు వచ్చాయి. జమ్మూకాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తర్వాత తొలిసారి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్సీ-కాంగ్రెస్ కూటమి విజయం సాధించిన విషయం తెలిసిందే. 90 స్థానాలున్న అసెంబ్లీలో ఎన్సీ 42 సీట్లలో, కాంగ్రెస్ 6 స్థానాల్లో గెలుపొందాయి. ఈ క్రమంలోనే ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. జమ్మూకాశ్మీర్‌కు రాష్ట్ర హోదా సాధించడమే తమ లక్ష్యమని ఎన్నికల ప్రచారంలోనూ ఒమర్ అబ్దుల్లా ప్రకటించారు. దీంతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా జమ్మూకాశ్మీర్ కు రాష్ట్ర హోదా ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు ఇప్పటకే ప్రకటించిన విషయం తెలిసిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com