Soumya Vishwanathan: జర్నలిస్ట్ సౌమ్య విశ్వనాథన్ హత్య కేసులో నలుగురికి జీవితఖైదు

Soumya Vishwanathan: జర్నలిస్ట్ సౌమ్య విశ్వనాథన్ హత్య కేసులో నలుగురికి జీవితఖైదు
15ఏళ్ల తర్వాత నలుగురు దోషులకు యావజ్జీవ శిక్ష

మహిళా జర్నలిస్ట్ సౌమ్య విశ్వనాథన్ హత్య కేసులో ఢిల్లీలోని సాకేత్ కోర్టు నలుగురికి జీవితఖైదు విధించింది. మరో ముద్దాయికి మూడేళ్ల జైలు శిక్ష విధించింది. 2008లో ఢిల్లీలోని వసంత్ కుంజ్ వద్ద ఈ హత్య జరిగింది. దోషులు రవి కపూర్‌, అమిత్‌ శుక్లా, బల్‌జీత్‌ మాలిక్‌, అజయ్‌కుమార్‌కు జీవిత ఖైదు విధించింది. ఒక్కొక్కరికి రూ.1.25 లక్షల జరిమానా వేసింది. ఐదో ముద్దాయి అజయ్‌శెట్టికి మూడేండ్ల సాధారణ జైలు శిక్షతోపాటు రూ.7.25 లక్షల జరిమానా విధించింది. ఇతడు గత 14 ఏండ్లుగా జైలులో ఉంటున్న అంశాన్ని ధర్మాసనం ఈ సందర్భంగా ప్రస్తావించింది. మొత్తం జరిమానాను బాధితురాలి కుటుంబానికి చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఇది అరుదైన కేసుల పరిధిలోని రానందున ముద్దాయిలకు మరణ శిక్షను తిరస్కరిస్తున్నట్టు ధర్మాసనం ప్రకటించింది.

ఇండియా టుడే గ్రూప్‌లో జర్నలిస్ట్ అయిన సౌమ్యా విశ్వనాథన్, సెప్టెంబర్ 30, 2008 తెల్లవారుజామున దక్షిణ ఢిల్లీలోని నెల్సన్ మండేలా మార్గ్‌లో దారుణహత్యకు గురయ్యారు. ఆమె విధుల అనంతరం ఇంటికి తిరిగి వస్తుండగా గుర్తుతెలియని దుండగులు నాటు తుఫాకీతో కాల్చి చంపారు. దీనికి చోరీయే కారణమని పోలీసులు పేర్కొన్నారు. అక్టోబరు 18న కోర్టు మొత్తం ఐదుగురు నిందితులపై హత్యానేరం కింద దోషులుగా నిర్ధారించింది. బుల్లెట్ గాయాలతో ఆమె కారులోనే ప్రాణాలు విడిచారు. ఎమ్‌సీఓసీఏ నిబంధనల ప్రకారం.. వ్యక్తి మరణానికి కారణమైన వ్యవస్థీకృత నేరానికి దోషులుగా పరిగణించడం జరుగుతుంది. ఆయా నేరాలకు గరిష్ట శిక్షగా మరణశిక్ష విధిస్తారు. అజయ్ సేథీ కూడా సెక్షన్ 411 ఎమ్‌సీఓసీఏ నిబంధనల ప్రకారం.. వ్యవస్థీకృత నేరాలను ప్రోత్సహించడం లేదా సహకరించడం, నిజాయితీ లేకుండా దొంగిలించిన ఆస్తిని పొందడానికి కుట్ర పన్నినందుకు దోషిగా కోర్టు నిర్ధారించింది.


ఈ కేసులో రవి కపూర్, అజయ్ కుమార్, బల్జీత్ మాలిక్, అమిత్ శుక్లా లపై హత్యా అభియోగాలను మోపిన ప్రాసిక్యూషన్ విభాగం ఆ అభియోగాలను నిరూపించడంలో సఫలమైంది. అజయ్ సేథీ అనే వ్యక్తిని ఐదో నిందితుడిగా పేర్కొన్నారు. సౌమ్య విశ్వనాథన్ వాహనాన్ని అజయ్ సేథీ అడ్డగించాడని ప్రాసిక్యూషన్ పేర్కొంది. 411 సెక్షన్ కింద అతడు దోషిగా నిరూపణ అయ్యాడు. పోలీసుల విచారణలో జర్నలిస్ట్ సౌమ్య మరణానికి మొదట కారు ప్రమాదమని భావించారు. కానీ, ఫోరెన్సిక్ నివేదికల్లో తలపై తుపాకీతో కాల్చడం కారణంగానే ఆమె మృతిచెందినట్టు తేలింది. కాగా, తుపాకితో కాల్చి అతి కిరాతకంగా హత్య చేసిన దుండుగులు.. ఆమె మృతదేహాన్ని కారులో పడేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.

కాగా, ఢిల్లీ కోర్టు తీర్పుపై సౌమ్య విశ్వనాథన్ తల్లి స్పందించారు. తీర్పు సంతృప్తి కలిగించిందే తప్ప, సంతోషం కలిగించలేదని అన్నారు.

Tags

Next Story