Super Moon 2023: భారత్‌లో ఎప్పుడు చూడొచ్చంటే...

Super Moon 2023: భారత్‌లో ఎప్పుడు చూడొచ్చంటే...
X
ఇవాళ ఆకాశంలో అద్భుత దృశ్యం... భూమికి సమీపానికి చంద్రుడు.. ఏడు రెట్లు ప్రకాశవంతంగా సూపర్‌ మూన్‌

ఆకాశంలో ఈ రోజు అపురూప దృశ్యం ఆవిష్కృతం కానుంది. గగనంలో నేడు సూపర్ మూన్ కనువిందు చేయనుంది. 2023లో వచ్చే నాలుగు సూపర్‌మూన్‌లలో మొదటిది జూలై 3 సోమవారం సంభవించనుందని శాస్త్రవేత్తలు తెలిపారు. సాధారణ పౌర్ణమి రోజు కంటే చంద్రుడు భూమికి అతి సమీపంగా రానున్నాడు. భూమి నుంచి 2 లక్షల 24 వేల 895.4 మైళ్ళ దూరంలో మూన్‌ ఉంటుందని వెల్లడించారు. మాములు పౌర్ణమి కంటే ఎక్కువగా ఇవాళ రాత్రి చంద్రుడు ఆకాశంలో ప్రకాశవంతంగా కనిపించనున్నాడు. ప్రకాశవంతమైన మూన్‌ను చూడాలంటే మాత్రం స్థానిక వాతావరణ పరిస్థితులు అనుకూలించాలని ఖగోళ పరిశోధకులు వెల్లడించారు. దేశ రాజధాని ఢిల్లీలో సాయంత్రం 5:08 నిమిషాలకు ఆకాశంలో సూపర్‌ మూన్‌ కనిపించనుందని వివరించారు. సాధారణంగా కనిపించేదానికంటే చంద్రుడు ఇవాళ ఏడు శాతం పెద్దగా కనిపిస్తాడు. ఆకాశంలో చంద్రుడు సాధారణం కంటే పెద్దగా కనిపించడాన్ని సూపర్‌మూన్ అంటామని మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీలోని అబ్రమ్స్ ప్లానిటోరియం డైరెక్టర్ డాక్టర్ షానన్ ష్మోల్ తెలిపారు.


జులైలో వచ్చే సూపర్‌ మూన్‌ను బక్ మూన్‌ అని కూడా అంటారు. అమెరికాలో సాధారణంగా జులై మాసంలో మగ జింక కొమ్ములు రాలడం తిరిగి పెరగడం జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో సూపర్‌మూన్‌ను బక్‌ మూన్‌ అని పిలుస్తారు.హాట్ మూన్ వంటి పేర్లు కూడా ఉన్నాయి. సాధారణంగా ఏడాదికి 12 పౌర్ణమిలు ఉండగా, 2023లో ఈ 13 పౌర్ణమిలు సంభవించనున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఆగస్టులో బ్లూ మూన్‌ సహా రెండు సూపర్‌మూన్‌లు వస్తాయి. 2023లో నాలుగు, చివరి సూపర్‌మూన్ సెప్టెంబర్ 29న వస్తుంది. ఆగస్టు 1న స్టర్జన్ మూన్‌, ఆగస్టు 30న బ్లూ మూన్, సెప్టెంబర్‌ 29న హార్వెస్ట్ మూన్, అక్టోబర్‌ 28న హంటర్‌ మూన్‌, నవంబర్ 27న బీవర్ మూన్.. డిసెంబర్ 26న కూల్‌ మూన్ పేరుతో సూపర్‌మూన్‌లు ఏర్పడతాయని పరిశోధకులు వెల్లడించారు. అమెరికా ప్రజలు అక్టోబరు 14న వలయాకార సూర్య గ్రహణాన్ని చూస్తారని వివరించారు. అక్టోబర్ 28న పాక్షిక చంద్రగ్రహణం కూడా ఏర్పడుతుంది. ఈ పాక్షిక గ్రహణాన్ని యూరప్, ఆసియా, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికాలోని కొన్ని ప్రాంతాల ప్రజలు మాత్రమే వీక్షిస్తారు.

Tags

Next Story