JUNK FOOD: జంక్ ఫుడ్ ప్రకటనలపై నిషేధం

JUNK FOOD: జంక్ ఫుడ్ ప్రకటనలపై నిషేధం
X

దేశంలో పెరుగుతున్న జీవనశైలి వ్యాధులు, అనారోగ్య ఆహారపు అలవాట్లపై దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం జంక్ ఫుడ్ ప్రకటనలపై కఠిన నియంత్రణలు విధించాలన్న సూచనలు చేసింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేలో ఈ అంశాన్ని ప్రాధాన్యంగా ప్రస్తావిస్తూ, ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యంగా కీలక ప్రతిపాదనలు చేసింది. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే ప్రకారం, చిప్స్, నూడిల్స్, పిజ్జా, బర్గర్లు, కూల్‌డ్రింక్స్ వంటి జంక్ ఫుడ్ ప్రకటనలపై ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అన్ని ప్రసార మాధ్యమాల్లో నిషేధం విధించాలని సూచించింది. ముఖ్యంగా పిల్లలు, యువత ఎక్కువగా ప్రభావితమయ్యే సమయాల్లో ఇలాంటి ప్రకటనలను పూర్తిగా నిలిపివేయాల్సిన అవసరం ఉందని సర్వే పేర్కొంది.

అదే విధంగా, ఉప్పు, చక్కెర, కొవ్వు అధికంగా ఉండే ఆహార ఉత్పత్తులపై స్పష్టమైన న్యూట్రిషన్ లేబులింగ్ తప్పనిసరి చేయాలని సిఫార్సు చేసింది. ఆహార ప్యాకెట్లపై పోషక విలువల వివరాలు స్పష్టంగా ఉండడం ద్వారా వినియోగదారులు అవగాహనతో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని ఆర్థిక సర్వే అభిప్రాయపడింది. జంక్ ఫుడ్ అధిక వినియోగం వల్ల స్థూలకాయం, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో, ప్రకటనల నియంత్రణతో పాటు ఆహార లేబులింగ్ విధానాలు ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలకంగా మారతాయని కేంద్రం భావిస్తోంది. ఈ ప్రతిపాదనలపై భవిష్యత్తులో స్పష్టమైన విధాన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని ఆర్థిక వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Tags

Next Story