
డబ్బుండటం గొప్పే కావచ్చు.. కానీ సొంత కాళ్ళ మీద నిలబడాలనుకోవడం ఇంకా గొప్ప.. అలా కోరుకొనే ఇప్పుడు వార్తల్లోకి వచ్చాడు మహాన్ఆర్యమాన్ సింధియా.. జ్యోతిరాదిత్య తనయుడు. దేశంలోనే రిచెస్ట్ పొలిటీషియన్లలో ఒకరు జ్యోతిరాదిత్య సింధియా. గ్వాలియర్ సంస్థాన వారసుడు అయిన జ్యోతిరాధిత్య ప్రస్తుతం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి. నిజానికి సింధియాల గురించి ప్రత్యేకంగా చెప్పుకొనవసరం లేదు. వీళ్లది నిజంగా రాజవైభోగం. ఈ కుటుంబం ప్రస్తుతం నివాసం ఉండే భవంతి విలువే కనీసం నాలుగు వేల కోట్ల రూపాయలు అని అంచనా. అటు రాజకీయాల్లో కూడా వీరికి మంచి పేరు ఉంది.
ఫ్యామిలీ రేంజ్ ఎంత గొప్పగా ఉన్నా జ్యోతిరాదిత్య తనయుడు మాత్రం తన సొంత సత్తా నిరూపించుకుందామని డిసైడ్ అయ్యాడు. రెండేళ్ల క్రితం 11 లక్షల పెట్టుబడితో ఇతడు ఒక స్టార్టప్ పెట్టాడు. మైమండీ పేరుతో ఒక అప్లికేషన్ ను ఈ జూనియర్ సింధియా రన్ చేస్తూ ఉన్నాడు. ఇది వినియోగదారులకు కూరగాయలను అందజేసే అప్లికేషన్. ప్రారంభించిన మొదటి ఏడాదికే మంచి లాభాల బాటపట్టిందట. ఏడాదిలో 60 లక్షలకు స్థాయికి చేరిందట దీని టర్నోవర్. ఇప్పుడు దానికి అదనంగా 4.1 కోట్ల రూపాయల ఫండింగ్ కూడా చేశారట. దీంతో.. దీని మార్కెట్ వ్యాల్యూ ఐదు కోట్ల రూపాయలకు చేరిందట.
మనది రాజకుటుంబం.. మనం కూరగాయలు అమ్ముకోవడం ఏంటి అనే ఒక చిన్న ఆలోచన పక్కన పెట్టి పనిలో దిగిన మహాన్ఆర్యమాన్ సింధియా ఇప్పుడు యువ వ్యాపారవేత్తగా వహ్వా అనిపించుకుంటున్నాడు .
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com