Jyoti Malhotra : కేరళ పర్యాటక ప్రచారంలో జ్యోతి మల్హోత్రా సర్కార్ రాచమర్యాదలు!

పాకిస్థాన్ గూఢచారి జ్యోతి మల్హోత్రాకు సంబంధించిన వార్త మరోసారి జాతీయ స్థాయిలో రచ్చ చేస్తోంది. కేరళ రాష్ట్రంలో ఆమెకు రాచమర్యాదలు జరిగినట్లుగా తాజాగా ఆర్టీఐ ద్వారా వెల్లడైంది. కేరళను ప్రపంచ పర్యాటక కేంద్రంగా ప్రోత్సహించడానికి ఎంపిక చేసిన 41 మంది ప్రభావశీలుల జాబితాలో జ్యోతి కూడా ఉండడం విశేషం. కేరళ ప్రభుత్వం ఆమెకు నిధులు సమకూర్చినట్లుగా ఆర్టీఐ విచారణలో వెల్లడైంది.
పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత హర్యానాకు చెందిన జ్యోతి మల్హోత్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈమె పాకిస్థాన్‌కు గూఢచర్యగా పని చేసినట్లుగా గుర్తించారు. పాకిస్థాన్ అధికారులతో చెట్టాపట్టాల్ వేసుకుని తిరిగినట్లుగా కనిపెట్టారు. అంతేకాకుండా వాళ్ల మద్దతుతో మూడు సార్లు పాకిస్థాన్‌ను కూడా చుట్టివచ్చింది. అక్కడ ప్రత్యేక ఏర్పాటు కూడా చేశారు. ఇక తాజాగా ఆమెకు సంబంధించిన వార్త కలకలం రేపుతోంది. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు కేరళ ప్రభుత్వం 41 మంది ఇన్‌ఫ్లుయెన్లర్లను నియమించుకుంది. అందులో జ్యోతి మల్హోత్రాను కూడా ఎంపిక చేసి ఆమెకు ట్రావెల్, భోజన వసతులు కల్పించింది. వీడియోలు తీసుకునేందుకు ఆమెకు ప్రత్యేక మనుషులను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సమాచార హక్కు చట్టం కింద ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
తాజాగా ఈ వ్యవహారంపై రచ్చ రేపుతోంది. ప్రభుత్వంపై విపక్షాలు మండిపడుతున్నాయి. పరిశీలన లేకుండా ఒక విదేశీ గూఢచారిని ఎలా నియమించుకుంటారని ఆరోపించాయి. ఇక ప్రతిపక్షాల విమర్శలపై కేరళ పర్యాటక మంత్రి పీఏ మహమ్మద్ రియాస్ స్పందించారు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు ఇతర ఇన్‌ఫ్లుయెన్లర్లతో పాటు జ్యోతిని కూడా ఆహ్వానించినట్లు చెప్పారు. ఇది కేరళ పర్యాటకాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతోనే చేసిన ప్రయత్నమన్నారు. మంచి ఉద్దేశంతో చేసిన కార్యక్రమమని.. కానీ ఆమె గూఢచారి అని ముందుగా తెలుసుకోవడం ఎవరికీ సాధ్యపడదన్నారు.
జ్యోతి మల్హోత్రా… కేరళలో కొచ్చి, కన్నూర్, కోజికోడ్, అలప్పుజ, మున్నార్, తిరువనంతపురం ప్రాంతాలను సందర్శించింది. ఈ వీడియోలను తన యూట్యూబ్ ఛానల్‌తో పాటు పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారాల్లో షేర్ చేసింది. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత మే నెలలో ఆమెను అరెస్టు చేశారు. పహల్గామ్ ఉగ్రదాడికి ముందు జ్యోతి మల్హోత్రా పాకిస్థాన్‌ను సందర్శించినట్లుగా పోలీసుల విచారణలో తేలింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com