Red Fort: ఎర్రకోటలో దొంగలు... కోటి రూపాయల బంగారు కలశం మాయం!

దేశ రాజధాని ఢిల్లీలోని అత్యంత పటిష్ఠమైన భద్రత ఉండే చారిత్రక ఎర్రకోట ప్రాంగణంలో భారీ చోరీ జరిగింది. జైనుల మతపరమైన కార్యక్రమంలో ప్రదర్శనకు ఉంచిన దాదాపు కోటి రూపాయల విలువైన బంగారు కలశాన్ని దుండగులు అపహరించారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ముఖ్య అతిథిగా హాజరైన సమయంలోనే ఈ ఘటన జరగడం తీవ్ర కలకలం రేపుతోంది.
వివరాల్లోకి వెళితే.. ఎర్రకోటలో ప్రస్తుతం జైనుల 'దశలక్షణ మహాపర్వం' పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ వేడుకల కోసం ప్రముఖ వ్యాపారవేత్త సుధీర్ జైన్ ప్రతిరోజూ తన పూజలో ఉపయోగించే విలువైన కలశాన్ని తీసుకొస్తున్నారు. సుమారు 760 గ్రాముల బంగారం, 150 గ్రాముల వజ్రాలు, కెంపులు, పచ్చలతో పొదిగిన ఈ కలశం అందరినీ ఆకర్షిస్తోంది.
ఈ వారం ప్రారంభంలో జరిగిన ఒక రోజు కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పాల్గొన్నారు. ఆయనకు స్వాగతం పలికే ఏర్పాట్లలో సిబ్బంది నిమగ్నమై ఉన్న సమయంలో ఏర్పడిన సందడిని ఆసరాగా చేసుకుని, వేదికపై ఉన్న కలశాన్ని గుర్తుతెలియని వ్యక్తి దొంగిలించాడు. కార్యక్రమం తిరిగి ప్రారంభమయ్యాక కలశం కనిపించకపోవడంతో నిర్వాహకులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు, సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ఈ ఫుటేజీలో ఒక అనుమానిత వ్యక్తి కదలికలను గుర్తించినట్లు తెలిపారు. నిందితుడిని గుర్తించామని, త్వరలోనే అరెస్టు చేసి కేసును ఛేదిస్తామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర్ 9 వరకు జరగనున్న ఈ కార్యక్రమం నేపథ్యంలో జరిగిన ఈ చోరీ, ఎర్రకోట భద్రతా ఏర్పాట్లపై మరోసారి తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. స్వాతంత్ర్య దినోత్సవాన ప్రధాని జెండా ఎగురవేసే ఈ చారిత్రక ప్రదేశంలో భద్రతా లోపాలు బయటపడటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని రోజుల క్రితమే స్వాతంత్ర్య దినోత్సవ భద్రతా డ్రిల్‌లో భాగంగా పెట్టిన డమ్మీ బాంబును గుర్తించడంలో విఫలమైనందుకు ఏడుగురు పోలీసు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడిన విషయం తెలిసిందే.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com