Kamal Haasan: ఇకపై ఆమె డ్రైవర్ కాదు ఓనర్

సెలబ్రిటీలను తన బస్సులో ఎక్కించుకొని హల్చల్ చేసిన తమిళనాడులో షర్మిల అనే మహిళా డ్రైవర్ తరువాత అదే కారణంతో ఉద్యోగాన్ని కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన పై నటుడు కమల్ హాసన్ స్పందించారు. ఆమెకు కారుని గిఫ్ట్‌గా ఇవ్వటమే కాకుండా ఆర్థిక సాయాన్ని కూడా అందించారు.
తమిళనాడులో ఉద్యోగాన్ని కోల్పోయిన షర్మిల అనే మహిళా డ్రైవర్ కు యూనివర్సల్ స్టార్, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ అండగా నిలిచారు. ఆమెను తన పార్టీ ఆఫీసుకి పిలిపించి మాట్లాడారు. ఆమెకు కారుని గిఫ్ట్‌గా ఇవ్వటంతో పాటు ఆర్థిక సాయాన్ని కూడా అందించారు.
ఇంతకీ ఆ డ్రైవర్ కు ఉద్యోగం ఎందుకు పోయింది అనే వివరాల్లోకి వెళితే..
డీఎంకే పార్టీ సభ్యురాలు, పార్లమెంట్ మెంబర్ కనిమొళి కొద్ది రోజుల క్రితం కోయంబత్తూరులో ప్రైవేటు బస్సులో ప్రయాణించారు. ఆ బస్సుకి షర్మిల డ్రైవర్, మరో మహిళా కండక్టర్ కూడా ఉన్నారు. షర్మిల బస్సుల నడపటాన్ని చూసిన కనిమొళి ఆమెను మెచ్చుకుని తన చేతి వాచీని గిఫ్ట్‌గా ఇచ్చారు. అయితే తను నడుపుతున్న బస్సులోని మహిళా కండక్టర్ కనిమొళితో అనుచితంగా ప్రవర్తించిందని షర్మిల యాజమాన్యం దగ్గర ఫిర్యాదు చేసింది. మరోవైపు తన పాపులారిటీ కోసం సెలబ్రిటీలను పిలిచి మరీ బస్సులోకి ఎక్కించుకుంటుందని, అందువల్ల ఇతర ప్రయాణీకులు చాలా ఇబ్బందులు పడుతున్నారంటూ మహిళా కండక్టర్ కూడా షర్మిలపై తిరిగి ఫిర్యాదు చేసింది. దీంతో యాజమాన్యం షర్మిలను ఉద్యోగం నుంచి తొలగించింది. మొత్తానికి ఎంపీ కనిమొళి కారణంగానే షర్మిల ఉద్యోగం పోయిందంటూ వార్తలు వైరల్ అయ్యాయి. ఈ న్యూస్ కాస్త కమల్ కు చేరటంతో ఆయన స్పందించారు. షర్మిలకు కారుని బహుమతిగా అందించారు. ఇక ఉద్యోగం చేసే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయి వరకు ఆమె ఎదగాలని తాను కోరుకుంటున్నాను అన్నారు.
ఇక కమల్ హాసన్ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ఆయన ఇప్పుడు రెండు క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తున్నారు. అందులో ఒకటి మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతుంది. నాయగన్ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందనున్న సినిమా ఇది. రెండవది ప్రాజెక్ట్ K. 600 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె నటిస్తున్నారు. నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com