Kangana Ranaut: సాగు చట్టాలపై వ్యాఖ్యల వివాదం..

బాలీవుడ్ క్వీన్‌గా పేరొందిన మండి లోక్‌సభ నియోజకవర్గ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా మరోసారి ఆమె హెడ్‌లైన్స్‌లోకి ఎక్కారు. రైతుల పోరాటంతో రద్దయిన మూడు వ్యవసాయ చట్టాలను మళ్లీ తీసుకురావాలంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
తన సొంత నియోజకవర్గం మండిలో మంగళవారం కంగన పర్యటించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. ‘నా ప్రకటన వివాదాస్పదం అవుతుందని నాకు తెలుసు. అయినా మూడు వ్యవసాయ చట్టాలను మళ్లీ తీసుకురావాలి. వీటి కోసం రైతులే డిమాండ్ చేయాలి.’ అని ఆమె వ్యాఖ్యానించారు. ఈ మూడు చట్టాలు రైతులకు ఎంతగానో మేలు చేస్తాయని, కానీ కొన్ని రాష్ర్టాల్లో రైతు సంఘాల ఆందోళనల వల్ల ప్రభుత్వం రద్దు చేయాల్సి వచ్చిందని ఆమె పేర్కొన్నారు. రైతుల మేలు కోసమే ఈ చట్టాలను మళ్లీ తీసుకురావాలని కోరుకుంటున్నానని కంగనా పేర్కొన్నారు. కంగన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే కంగన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అని తెలిపారు. ఇందులో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ‘ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ఇందులో పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. నా అభిప్రాయాలు, మాటలతో ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే అందుకు నన్ను క్షమించండి. నేను నా మాటలను వెనక్కి తీసుకుంటున్నాను’ అని కంగన వీడియో విడుదల చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com