Kangana Ranaut: చెంపదెబ్బ వ్యాఖ్యలపై స్పందించిన కంగనా రనౌత్

బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై తమిళనాడు కాంగ్రెస్ మాజీ చీఫ్, సీనియర్ నేత కేఎస్.అళగిరి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. కంగనా దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటిస్తే.. రైతులు చెంపదెబ్బ కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి.
తాజాగా కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై హిమాచల్‌ప్రదేశ్ పర్యటనలో ఉన్న కంగనా రనౌత్ స్పందించారు. తాను దేశంలో ఎక్కడికైనా వెళ్లొచ్చు.. తిరగొచ్చు అన్నారు. ఎవరూ ఎవరినీ ఆపడానికి వీల్లేదని తెలిపారు. అయినా రాజకీయాల్లో గానీ.. సినిమాల్లో గానీ ద్వేషించే వారుంటారు.. ప్రేమించేవారుంటారని తెలిపారు. తనకు తెలిసి ప్రేమించే వారే ఎక్కువ మంది ఉన్నారని పేర్కొన్నారు. తాను ‘‘తలైవి’ సినిమాలో మాజీ ముఖ్యమంత్రి జయలలిత పాత్రను పోషించానని.. దీంతో తమిళనాడులో సానుకూల స్పందన వచ్చిందని గుర్తుచేశారు. తమిళనాడుకు చెందిన ప్రతిపక్ష ఎంపీలు కూడా తనను ‘‘తలైవి’’ అని పిలుస్తారని చెప్పుకొచ్చారు. కాబట్టి ఏదో వ్యక్తి.. ఏదో మాట్లాడినంత మాత్రాన ఎటువంటి ఇబ్బంది లేదన్నారు.
అయితే కంగనాపై చేసిన వ్యాఖ్యలను అళగిరి సమర్థించుకున్నారు. 10-15 రైతులు తన దగ్గరకు వచ్చారని.. ఆ సమయంలో 2020లో రైతుల గురించి కంగనా చేసిన వ్యాఖ్యల గురించి తన దగ్గర ప్రస్తావించారన్నారు. దీంతో ఆమెను దక్షిణాదికి వస్తే మీరు కూడా చెంపదెబ్బ కొట్టాలని తానే చెప్పినట్లు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను చేసింది. దీనికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. అయితే ఆందోళనలో పాల్గొన్న మహిళల గురించి కంగనా సోషల్ మీడియాలో తప్పుడు వ్యాఖ్యలు చేశారు. రూ.100 ఇచ్చి వృద్ధ మహిళలను నిరసనల్లో కూర్చోబెట్టుకుంటున్నారని రాసుకొచ్చారు. ఈ వ్యాఖ్యల తర్వాత చండీగఢ్ విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్.. కంగనాను చెంపదెబ్బ కొట్టింది. ఇదే విషయాన్ని అళగిరి గుర్తు చేస్తూ.. మీరు కూడా కంగనాను చెంపదెబ్బ కొట్టాలని రైతులకు పిలుపునిచ్చారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com